ప్రజలకు, ప్రభుత్వానికి వారధి అధికారులు
Bridge officials to the people and the government
సంక్షేమ ఫలాలు నిరుపేదలకందించాలి
ఆరు గ్యారెంటీల అమలులో అలసత్వం తగదు
రెండు నెలలకోసారి సమీక్షా సమావేశాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నా తెలంగాణ, సంగారెడ్డి: అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ బుధవారం ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లోని జిల్లాలో ఆరు గ్యారెంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు శాఖల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల కాలం పూర్తయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సంక్షేమ పథకాల అమలులో జాప్యం నెలకొందన్నారు. ప్రస్తుతం సంక్షేమ ఫలాలను విస్తృతంగా అందించగలుగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్, ఇరిగేషన్, ఎక్సైజ్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలకు సుపీరియల్ పవర్స్ ఇచ్చిందన్నారు. ఆయా శాఖలలో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు,
విద్యా, వైద్యం, సీజనల్ వ్యాధులు, త్రాగునీరు, రుణమాఫీ , నూతన రుణాల పంపిణీ, చేనేత కార్మికుల సమస్యలు, గృహ జ్యోతి పథకం ఆర్టీసీ విద్యాశాఖ మున్సిపల్ ఎక్సైజ్ పంచాయతీరాజ్ మిషన్ భగీరథ దేవాదాయశాఖ వనమహోత్సవం, నిమ్జ్ భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. గ్యారంటీల అమలుపై ప్రతీ రెండు నెలలకోసారి సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములలో దేవాలయాల ఉపయోగపడే విధంగా అవసరమైన మొక్కలను పంపిణీ చేసి నాటించాలని అధికారులకు ఆదేశించారు. దేవాదాయ భూములను సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేయాలని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ ఒక్క అధికారి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీఐసిసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్ రావు, సంజీవరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.