నారాయణపేట జిల్లాలో ఘటన
విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
నా తెలంగాణ, మహబూబ్ నగర్ : మధ్యాహ్న భోజనం వికటించి 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్నది. సాంబారు, గుడ్లతో మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. పలువురు విద్యార్థులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. మరి కొంతమంది విద్యార్థులు తమ సెల్ ఫోన్లలో సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చిత్రించేందుకు ప్రయత్నించారు. స్థానిక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి ఫోన్లు లాక్కొని వైద్య వైద్య సేవలు అందిస్తామని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థుల పరిస్థితి విషమిస్తుండడంతో కొందరిని మక్తల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కలుషిత ఆహారము తీసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు సమాచారం