రైతుల పరిస్థితి దయనీయం

మాజీమంత్రి హరీశ్ రావు

Nov 22, 2024 - 19:32
 0
రైతుల పరిస్థితి దయనీయం
పంట కొనలేని స్థితిలో ప్రభుత్వం
ఖమ్మంలో పత్తి కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేయాలి
 
నా తెలంగాణ, ఖమ్మం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన హరీశ్ రావు అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పంట కూడా కొనలేని దుస్థితి నెలకొందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందని, కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా దక్కని పరిస్థితి ఉందని విమర్శించారు. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారని, రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందని ప్రశ్నించారు. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదని, పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శంకర్ రమాదేవి అనే రైతులు 8 ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం 5 క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నాయకులు హరీష్ రావు వెంట ఉన్నారు.