సీఎం రేవంత్‌రెడ్డి
రైతులకు రూ.54 వేల కోట్లు ఖర్చు చేశాం
ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చాం
రూ.20 లక్షల భూ నష్టపరిహారం చెల్లిస్తా..
నా తెలంగాణ, మహబూబ్‌నగర్: మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ సభలో సీఎం ప్రసంగించారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని అభిప్రాయపడ్డారు. నవంబర్ 30 ఎంతో ప్రత్యేకమైందని, సరిగ్గా ఏడాది కిందట మీరంతా ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేశారని గుర్తు చేశారు. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి, హైదరాబాద్‌కు వలస పోయాయి. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని అన్నారు.
ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చాం
గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం అనలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చిందన్నారు. గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే.. మూడేళ్లు నిండకుండానే ఆ ప్రాజెక్టు కూలిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా.. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని, కానీ, కాంగ్రెస్ హయాంలో ఏడాది కాలంలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వే లోట్లతో రైతు ఋణమాఫీ చేశామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు.
రూ.20 లక్షల భూ నష్టపరిహారం చెల్లిస్తా..
నా సొంత జిల్లాలో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామనుకుంటే విపక్షాలు ప్రజలకు మాయమాటలు చెప్పి రెచ్చగొడుతున్నాయన్నారు. నా జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. కానీ, మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలు అడ్డుకుంటున్నారు. వారి మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారని, జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూ సేకరణ చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అధికారులను కొడితే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చెప్పే మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. ఎకరానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరారు. ‘‘కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. కానీ, పరిశ్రమల కోసం మాత్రం 1300 ఎకరాల భూమి సేకరించొద్దా.? పాలమూరు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.