ఆసిఫాబాద్ లో టైగర్ టెన్షన్

Tiger tension in Asifabad

Nov 30, 2024 - 22:37
 0
ఆసిఫాబాద్ లో టైగర్ టెన్షన్

 వరుస ఘటనలతో జనాలు బెంబేలు
15 గ్రామాలకు హై అలర్ట్
జిల్లాలో 144 సెక్షన్‌
ఒకరు మృతి.. మరోకరికి గాయాలు

నా తెలంగాణ, ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి సంచారంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారంలో ఉదయం పత్తి ఏరుతున్న మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి గాయపరిచింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తున్న పులులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువుల మందలపై పంజా విసురుతూ దడ పుట్టిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం దహెగాం మండలం దిగడ గ్రామానికి చెందిన విగ్నేశ్‌ను, పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మలను, గతేడాది వాంకిడి మండ లం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము ను పొట్టనబెట్టుకోగా, ఆ ఘటనలు మరవకముందే శు క్రవారం ఓ పులి మరో మహిళను బలి తీసుకున్నది.

పత్తి ఏరుతుండగా దాడి..

కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) .. శుక్రవారం మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత్తి ఏరేందుకు వెళ్లింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందరూ పనిలో నిమగ్నం కాగా.. పెద్ద పులి ఒక్కసారిగా మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. కూలీలు కేకలు వేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. లక్ష్మిని వెంటనే పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

రైతుపై పెద్దపులి దాడి

సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. రైతు సురేశ్ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. అంతా కలిసి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. పులి దాడిలో సురేశ్‌ మెడకు తీవ్రగాయాలు కాగా.. తోటి రైతులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళపై దాడి చేసి చంపిన 24 గంటల వ్యవధిలోనే మరో దాడి జరగడంతో జిల్లావాసులు పులి భయంతో వణికిపోతున్నారు.

15 గ్రామాల్లో హై అలర్ట్

పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.  రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బోనులు, పులి కదలికలను గమనించేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారు పొలం పనులకు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇప్పటి వరకు నలుగురు

జిల్లాలో పులుల దాడుల్లో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. 2020 నవంబర్‌ 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ చేపల వేటకు వెళ్లగా, పులి దాడి చేయడంతో మృతి చెందాడు. 2020 నవంబర్‌ 29న పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల (15) పత్తి ఏరుతుండగా, పెద్ద పులి దాడిచేసి చంపేసింది. అలాగే 2023 నవంబర్‌ 16న వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము తన చేనులో పత్తి ఏరుతుండగా పులి పంజా విసరడంతో మృత్యువాత పడ్డాడు. తాజాగా.. శుక్రవారం గన్నారంలో పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలో పులుల దాడుల దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 40 వరకు పశువులపై దాడులు చేశాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని ప్రజలు వణికిపోతున్నారు.