దేశానికి ఆదర్శం వాజ్ పేయి జీవితం
Vajpayee's life is an ideal for the country
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు
అంబేద్కర్ ని అడుగడుగునా అడ్డుకొని అవమానించింది కాంగ్రెస్
నా తెలంగాణ, హైదరాబాద్ : వాజ్ పేయి జీవితం దేశానికే ఆదర్శమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నవయువ హృదయ సామ్రాట్ గా ఆయన పేరుతెచ్చుకున్నారని చెప్పారు. అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశంలోని అనేక సామాజిక సంస్థలు శతాబ్ధ ఉత్సవాలను 2025 డిసెంబరు 25 వరకు జరుపుకోవాలని నిర్ణయించిన్నట్లు వెల్లడించారు.
వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్ పేయి ఉపన్యాసం వినేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చేవారు. ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణితో ఎమర్జెన్సీ విధించడంతో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. పత్రికా స్వేచ్ఛను హరించారు. అప్పుడు జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో జనసంఘ్ నాయకులు పోరాటం చేశారు. లక్షలాది మందిని జైలులో పెట్టారు. అప్పుడు వాజ్ పేయి 18 నెలల పాటు జైలులో ఉన్నారు. బంగారు లక్ష్మణ్ , ఇంద్రసేనారెడ్డి లాంటి వేలాది మంది నాయకులు, స్వయం సేవక్ నాయకులు, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలుకెళ్లారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో 1977లో జన సంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు.
అంబేద్కర్ గురించి, ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అక్కర్లేదు. అంబేద్కర్ ని అడుగడుగునా అడ్డుకొని అవమానించింది కాంగ్రెస్. ఆయనకు ఎటువంటి సహకారం అందించలేదు. అంబేద్కర్ ని రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్. అంబేద్కర్ ని మంత్రిగా రాజీనామా చేయించిన ఘనత నెహ్రూ కి దక్కుతుంది. ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకులకు భారతరత్న ఇచ్చుకున్నారు. రాజ్యాంగ రూపకల్పన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ కు మనసు ఒప్పుకోలేదు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ కు మనసొప్పలేదు.
అంబేద్కర్ గౌరవార్థం 2014లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ అంబేద్కర్ కు సంబంధించిన ముఖ్యమైన ఐదు ప్రాంతాలను "పంచ తీర్థాలు"గా తీర్చి దిద్ది భారతదేశ చరిత్రలో సముచిత స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, నియంతృత్వ చర్యలను ఈ ఏడాది పాటు ప్రజలకు తెలియజేస్తాం. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి. వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను అని కిషన్ రెడ్డి తెలిపారు.