వైద్యులు సమ్మె విరమించాలి
వైద్యుల భద్రతకు కేంద్రం, సుప్రీం హామీ వైద్యులకు ఎయిమ్స్ విజ్ఞప్తి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వైద్యుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు హామీ ఇచ్చిన నేపథ్యంలో రోగుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెలో ఉన్న వైద్యులు తిరిగి విధుల్లోకి చేరాలని ఎయిమ్స్ (ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) విజ్ఞప్తి చేసింది. ఆందోళనలు పరిష్కరించేందుకు ఎయిమ్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని బుధవారం తెలిపింది. రోగుల సందర్శకుల ద్వారా వైద్యులకు భద్రతకు సంబంధించి అంతర్గతంగా పదిహేనుమంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. పగలు, రాత్రి వైద్యుల భద్రతపై ఈ కమిటీ ఏం చర్యలు తీసుకోవాలన్న నివేదికను ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు అందజేస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కమిటీకి వైద్యులు తమ సూచనలు, సలహాలను అందజేయొచ్చని ఎయిమ్స్ స్పష్టం చేసింది. రోగులకు సరైన వైద్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, అదే సమయంలో వారి భద్రతపై కూడా తాము కేంద్రానికి, సుప్రీం నియమించిన కమిటీ సభ్యులతో చర్చిస్తున్నట్లు ఎయిమ్స్ పేర్కొంది.