-అదును చూసి కబ్జా భూమిలో అక్రమ కట్టడాలు
-కబ్జాలకు సపోర్ట్ ఎవరిదో?
-రాత్రికి రాత్రే వెలిసిన ప్రహరీ నిర్మాణాలు
అయోమయంలో అధికారులు
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ ఏరియాలో కబ్జాదారులు రోజురోజుకు మరి రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పలువురు అధికార పార్టీ పెద్దల అండతో కబ్జా చేసేస్తున్నారు. సింగరేణి సంస్థ ఖాళీ స్థలాలు కబ్జా కోరాలకు చిక్కకుండా బోర్డులు పెట్టినప్పటి ఖద్దర్, కాలర్ల సపోర్ట్ తో వాటిని తొలగించడం లేదా వాటిని పక్కకు నెట్టివేసి ఆక్రమణలను పాల్పడుతున్నారు. ఎవరైనా అడ్డు చెబితే ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇదే క్రమంలో రామకృష్ణాపూర్ పట్టణం నడిబొడ్డున సూపర్ బజార్ ప్రాంతంలో గల సింగరేణి ఖాళీ స్థలం ఆక్రమణల కోరల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సింగరేణి ఖాళీ స్థలంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా భావించి ఈ స్థలంలో ప్రహారీ నిర్మాణాలు చేయడంతో సింగరేణి ఎస్టేట్, ఎస్ అండ్ పీసీ సిబ్బంది ఈ నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సంస్థ ఎవ్వరికీ స్థలం అప్పగించలేదని నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు వెళ్లిపోగానే రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలో ప్రహారీ నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం. ఇది గమనించిన సింగరేణి అధికారులు పోలీసులను ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా దేవుడిపేరు, నాయకుల మద్ధతుతో ఈ స్థలాన్ని స్వాహా చేద్దామని అక్రమార్కులు స్కెచ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.