సమగ్ర సర్వే కు సర్వం సిద్ధం

Everything is ready for the comprehensive survey

Nov 1, 2024 - 19:15
 0
సమగ్ర సర్వే కు సర్వం సిద్ధం
నా తెలంగాణ, నిర్మల్/సంగారెడ్డి/మెదక్​: సమగ్ర సర్వేకు అంతా సిద్ధమైంది. సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్భందీగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు.
 
నిర్మల్​ లో.. అధికారులు చేపడుతున్న సర్వే తీరుపై నిర్మల్​ జిల్లా కలెక్టర్​ అభిలాష అభినవ్​, అదనపు కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్​ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సర్వేలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ సర్వేలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయాంశాలను సమీక్షిస్తామన్నారు. సర్వే పూర్తయ్యాక ఎన్యూమరేటర్లు ఇంటికి స్టిక్కర్లను అతికించాలన్నారు. సర్వేలో ఖచ్చితత్వంతోపాటు సమయపాలన పాటించాలని లోటుపాట్లకు తావీయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక అధికారి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
సంగారెడ్డిలో కలెక్టర్​ వల్లూరు క్రాంతి..
సమగ్ర ఇంటింటి సర్వేను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ఏర్పాట్లపై అధికారులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా స్వయంగా కలెక్టర్​ కొన్ని ఇళ్లను సందర్శించి వివరాలను ఆరా తీశారు. సర్వేలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్యూమరేటర్లు నిర్ణీత ఫార్మాట్​ లో సర్వే వివరాలను నమోదు చేయాలన్నారు. సర్వే పూర్తయిన ఇళ్లకు విధిగా స్టిక్కర్లను అతికించాలన్నారు. అనంతరం ఇరిగిపల్లి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు తక్కువ ఉండటంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్  విజయలక్ష్మి, మండల ప్రత్యేకధికారి ఖాసీం బేగ్, తహశీల్దార్​ దేవదాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
సర్వేపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ..
మెదక్​ జిల్లాలో ఇంటింటి సమగ్ర సర్వేపై కలెక్టర్​ రాహుల్​ రాజ్​ ఆరా తీశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్​ ద్వారా అధికారులకు పలు సూచనలు సలహాలు జారీ చేశారు. ప్రతీ కుటుంబం వివరాలు క్రమ పద్ధతిలో నమోదు చేసి జాబితా తయారు చేయాలన్నారు. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 1.68 లక్షల కుటుంబాలుండగా 1600మంది  ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ నగేష్ , మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, సంబంధిత తహశీల్దార్​ లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.