రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
--అర్ధరాత్రి నుంచే కురుస్తున్న మంచు
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలి
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి
నా తెలంగాణ, మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకు చలి పంజా విసురుతున్నది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగింది. దానికి తోడు మంచు కురుస్తుండడంతో ఉదయం పూట బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతల తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి వేగంగా పడిపోతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మంచు నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వాళ్లు తమ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లాల్సి నా పరిస్థితులు. వేగంగా వెళ్తే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
గత సారితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో ఇల్లు నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో నెలకొన్నాయి. కాస్త ఎండ వచ్చిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో శివాలయాల్లో సందడి నెలకొంది. చలి తీవ్రత నేపథ్యంలో భక్తులు తెల్లవారుజాము నుంచే దేవాలయాల్లో పూజలు చేసేందుకు వెళ్తున్నారు. చలిని లెక్కచేయకుండా దేవాలయాల్లో దర్శనమిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి.. మాకు ఏమీ కాదులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చలి తీవ్రత రోజుకు పెరుగుతున్నందున పిల్లలను మొదలుకొని పెద్దల వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.
మార్నింగ్ వాక్ ఆలస్యం...
తెల్లవారుజాము నుంచే రోడ్లపై వాకింగ్ చేసేవారు చలి నేపథ్యంలో ఆలస్యంగా వాకింగ్ చేస్తున్నారు. చలి తీవ్రత పెరిగినందున ఎండ వచ్చిన తర్వాతే వాకింగ్ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఎవరికి ఎలాంటి జబ్బులు వస్తున్నాయో చెప్పలేని పరిస్థితులు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది వాకింగ్ చేస్తున్నారు. జీమ్ లకు వెళ్తున్నారు. వాకింగ్ చేసేవాళ్లు స్వెటర్లు వేసుకొని ఆలస్యంగా వెళుతున్నారు. చలి తీవ్రత కారణంగా చలి మంటలు వేసుకుంటున్నారు. చలి పెరిగిన నేపథ్యంలో ఎండ వచ్చేంత వరకు చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. మరికొన్ని రోజులపాటు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్లో గట్టెక్కినట్లే.
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి...
ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోవడంతో రాత్రి పూట కూడా పొగ మంచు ఎక్కువగా కురుస్తున్నది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా పొగ మంచు ప్రభావం కనిపిస్తున్నది. ఈ తరుణంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకు తెల్లవారుజాము ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాతీయ రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుపై పొగ మంచుతో ముందు ఉన్న వాహనదారులు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై వాహనదారులు వేగంగా వెళ్లడం వల్లనే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శీతాకాలంలో జరుగుతున్న ప్రమాదాలతో ఔటర్ రింగ్ రోడ్డు పైన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని దీనికి ప్రధాన కారణం వాహనదారులు వేగంగా వెళ్లడమే నాని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లైట్లు వేసుకొని మెల్లగా వెళ్లాలని పోలీసులు స్పష్టమైన సూచన చేస్తున్నారు. వేగంగా వెళ్లడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి..
ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు వ్యాధుల బారీన పడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరడంతో దీన్ని ప్రభావం పిల్లలు, వృద్ధులపై తీవ్రంగా పడుతున్నాయి. రైతులు తెల్లవారుజాము నుంచే పొలాల పనులకు వెళ్తుంటారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, స్వైన్ ఫ్లూ వంటి రోగాలు వస్తున్నాయి. అస్తమా, అలర్జీ, నిమోరియా వంటి సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఉదయం పూట వాకింగ్ కు వెళ్లేవారు సమయం మార్చుకోవాలని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముక్కు.. చెవిలు. తలభాగం కప్పుకొని వెళ్లాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు.