నమ్మి అధికారమిస్తే నట్టేట ముంచారు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి 

Dec 7, 2024 - 20:20
 0
నమ్మి అధికారమిస్తే నట్టేట ముంచారు

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పాలనపై ఫైర్​
ఆరు గ్యారంటీలు, 420 హామీలపై సరూర్​ నగర్​ లో సభలో కేంద్రమంత్రి

నా తెలంగాణ, హైదరాబాద్: అనేక పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ కుటుంబతత్వ, అవినీతి పాలనతో విసుగు చెంది, ప్రజలు కాంగ్రెస్​ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకువస్తే వారు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలపై శనివారం సరూర్​ నగర్​ లోని ‘కాంగ్రెస్​ యేడాది పాలన వైఫల్యాల’ సభలో పాల్గొని ప్రసంగించారు. 

కేసీఆర్​, రేవంత్​ రెడ్డి కవలపిల్లల్లాంటివారే..
కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మార్పు రాలేదని, మేలు జరగలేదని ఆరోపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీ పరిపాలన దొందూ దొందెనని ఇరు పార్టీలు కవలపిల్లల్లాంటివని విమర్శించారు. కేసీఆర్​, రేవంత్​ రెడ్డి అవినీతి, కుటుంబ పాలనలో ఇద్దరిది ఒకటే విధానమన్నారు. నిజమైన మార్పు రావాలంటే విద్యావంతులు, మేధావుల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. 

అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీతోనే సాధ్యం..
రైతు రుణమాఫీ, పెన్షన్​ రూ. 4 వేలు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2500 హామీలు ఇలా అనేక హామీలను కేవలం వందరోజుల్లోనే అమలు చేస్తామన్న కాంగ్రెస్​ ప్రభుత్వం 12 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ర్టాల్లో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్​ వచ్చాక ఒక్క కొత్త రేషన్​ కార్డు, పెన్షన్​ లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 

బీజేపీకి తెలంగాణ సమాజం అండగా నిలవాలి..
కాంగ్రెస్​ పార్టీకి 8 సీట్లిస్తే, బీజేపీకి 8 సీట్లిచ్చారని బీజేపీ బలపడాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అర్థం అవుతుందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల వరకూ కాంగ్రెస్​ పాలనను ఎండగట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షల కోసం అంకిత భావంతో పనిచేస్తామని, తెలంగాణ సమాజమంతా అండగా నిలవాలని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.