నా తెలంగాణ, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో సమగ్ర సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో ఈ సర్వే ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులకు శిక్షణ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ప్రణాళిక అధికారి జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైద్యవసతుల కల్పనకు కృషి..
మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ రూ.1.56 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, పెంబి మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజూర సత్యం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డీఈఓ రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ నర్సయ్య, ఎంపీడీవో రమాకాంత్, అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.