ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఉపేక్షించేది లేదన్న జిల్లా వైద్యాధికారిణి కళావతి భాయి
నా తెలంగాణ, డోర్నకల్: ఆర్ ఎంపీ వైద్యులు స్థాయికి మించిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని మహాబూబాబాద్ జిల్లా వైద్యాధికారిణి కళావతి భాయి అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కళావతి భాయి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రికి కూతవేటు దూరంలో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో దాడులు నిర్వహించి ఆర్ ఎంపీ వైద్యుడు రాస్తున్న మందుల చీటిలను పరిశీలించి అవాక్కయ్యారు. ఎం చదివారని ఈ మందులు రాశారని నిలదీశారు. ఆర్ఎంపీలకు ప్రభుత్వం కొన్ని దిశా నిర్దేశాలను సూచించిందని అవి తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత మందులను రాస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని సీజ్ చేశారు.