- నెలరోజులుగా సమస్యను చెబుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు
- మంచాలకే పరిమితమవుతున్న గ్రామస్థులు
- నీరు,పర్యావరణ కలుషితమా తేల్చలేకపోతున్న వైద్యాధికారులు
- ఏం చేయాలో పాలుపోని స్థితిలో గ్రామస్థుల ఆవేదన
నా తెలంగాణ, హనుమకొండ: భీంపెల్లి గ్రామాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. సుమారు వెయ్యి మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గాక వారం రోజులకు కాళ్ల వాపులు, ముఖం నల్లగా మారుతోందని, వాపులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇంత జరిగినా వైద్యాధికారులు, గ్రామ పెద్దలు వచ్చి చూసుపోతున్నారే తప్ప అసలు కారణాలేంటో తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం భీంపెల్లి లో గత నెలరోజులుగా ఈ సమస్య నెలకొంది. ఒక్కసారిగా గ్రామస్థులకు జ్వరాలు, కాళ్లవాపులతో బాధపడుతున్నారు. వైద్యం తీసుకొని మందులు వాడుతునన్నీ రోజులు జ్వరాలు, వాపులు తగ్గినా తిరిగి వారం కాగానే మళ్లీ వాపులు, జ్వరాలు తిరగబెడుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. టెస్టుల్లో అంతా నార్మల్ గానే వస్తున్న అసలు ఈ విధమైన అనారోగ్యానికి కారణాన్ని మాత్రం వైద్యాధికారులు కనిపెట్టడం లేదని, పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాళ్లవాపులు, ముఖం వాచిపోవడం, చర్మం నల్లబారడం, కళ్లలో నుంచి నీరు కారడం, దురద లాంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
జ్వరాలకు కారణం ఏంటీ?
నీరు,, దోమ కాట్లు, పర్యావరణాలు కలుషితమా మరేదైనా కారణమా అనేది తెలియడం లేదు. అధికారులకు చెబితే ఈ విషయాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నా, జ్వరాలు తిరిగబెడుతున్నాయని వాపోతున్నారు.
ఇప్పటికైనా వైద్యాధికారులు, ప్రభుత్వాధికారులు, గ్రామపెద్దలు తమకు వచ్చిన జ్వరాల గుట్టును తెలుసుకొని సరైన వైద్యం అందిస్తే గానీ తమ ప్రాణాలు నిలిచేట్టుగా లేవని గ్రామస్థులు వాపోతున్నారు. నెలరోజులుగా ఈ సమస్యపై మొరపెట్టుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.