పోలీసు స్టేషన్​ లో చోరుల హస్తలాఘవం

మత్తు నిద్దురలో పోలీసులు!

Oct 13, 2024 - 13:14
Oct 13, 2024 - 13:33
 0
పోలీసు స్టేషన్​ లో చోరుల హస్తలాఘవం
రెండు వాహనాలు, ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
బూర్గంపాడు పోలీస్​ స్టేషన్​ లో ఘటన
ఎస్పీ హెచ్చరించిన సిబ్బందిలో రాని మార్పు
విషయం బటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు
భద్రాద్రి కొత్తగూడెం: చోరులు పోలీసులకే సవాల్​ విసిరారు. ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు దర్జాగా పోలీస్​ స్టేషన్​ ఆవరణలోకి, స్టేషన్​ లోకి చొరబడి ద్విచక్ర వాహనం, డ్యూటీలో ఉన్న పోలీసుల మొబైల్​ ఫోన్లు చోరీ చేసి షాక్​ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ విషయాన్ని బయట పెట్టకపోవడం కొసమెరుపు.
 
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్​ స్టేషన్​  ఆవరణ పార్కింగ్​ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తుంది? మరుసటి రోజే మళ్లీ వచ్చిన యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని, డ్యూటీలో ఉండగా నిద్దురలో జారుకున్న కానిస్టేబుల్స్​ మొబైల్​ ఫోన్లను చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దొంగతనాల విషయం బయటికి పొక్కనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం. 
 
బూర్గంపాడు పోలీస్​ స్టేషన్​ లోని విధులు నిర్వహిస్తున్న పోలీసుల వ్యవహారం కాస్త ఎస్పీ రోహిత్​ రాజ్​ కు తలనొప్పిగా మారింది. సిబ్బంది పనితీరుపై పలుమార్లు ఆయన హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెట్టారు. దీంతో పలువురు సిబ్బందిని విధుల నుంచి ఇతర చోట్లకు మార్చారు కూడా. అయినా ఈ స్టేషన్​ పోలీసుల్లో మార్పు రానట్లు కనబడుతోంది.
 
ఇంత దర్జాగా రాత్రివేళ వచ్చి ఏకంగా స్టేషన్​ లోకి వచ్చివాహనాలు, పోలీసుల ఫోన్లు సైతం ఎత్తుకెళుతుండగా పోలీసులు ఏం చేస్తున్నట్లో వారికే తెలియాలి?ఈ స్టేషన్​ లోని సిబ్బందిపై మరో ఆరోపణ కూడా ఉంది. రాత్రివేళ మద్యం సేవించి విధులకు హాజరవుతారన్న అపవాదు ఉంది. ఇదే నేపథ్యంలో వారు నిద్ధుర పోతుంటే చోరులు తమ హస్తలాఘవాన్ని ఏకంగా స్టేషన్​ పైనే ప్రయోగించి సత్తా చాటుకోవడం విశేషం.