ఏడు జెఎన్ వీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ కు కృతజ్ఞతలు
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో ఏడు నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ విద్యావిధానం మరింత పటిష్ఠం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు నూతన జవహర్ నవోదయ విద్యాలయా(జెఎన్వీ)లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజల విద్యావిధానంలో మార్పు చోటు చేసుకుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఆకాంక్షలను గౌరవించే నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో నూతన జెఎన్ వీ లను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశానని కేంద్రమంత్రి వివరించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
4వేల మందికి విద్య, 330 మందికి ఉపాధి..
జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో దాదాపు రూ.340 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఏడు జెఎన్ వీల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుంచి 12 వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది. 330 మందికి కొత్తగా ఉపాధి లభించనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.