నా తెలంగాణ, మెదక్: విలువలతో కూడిన జర్నలిజంతో సమాజానికి మేలు జరుగుతుందని, ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో వార్తలుండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జర్నలిస్టులను కోరారు. మెదక్ లోని కలెక్టరేట్ లో శుక్రవారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని సంతల్లో, మండల కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక మహిళలు, విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారని ఇలాంటి వాటిపై వార్తలు రాస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తి చాలా పవిత్రమైనదన్నారు. వాస్తవమైన వార్తలు ప్రచురించాలని జర్నలిస్టులను కోరారు. వివక్ష, మూఢనమ్మకాలు, సామాజిక బహిష్కరణలు, ఎస్సీ, ఎస్టీ చట్టాలు తదితరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వార్తలుండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణ కాంత్, శివ చరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, డీపీఆర్ వో రామచంద్ర రాజు, బాబురావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.