భద్రాద్రిలో మావోయిస్టుల బ్యానర్లు

పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు

Nov 30, 2024 - 22:40
 0
భద్రాద్రిలో మావోయిస్టుల బ్యానర్లు

నా తెలంగాణ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో లచ్చన్న దళానికి ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ తర్వాత అక్టోబర్ లో ఈ జిల్లాలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా, మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలని బ్యానర్లు ప్రదర్శించారు. పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లను మరోసారి ముమ్మరం చేస్తున్నాయి. పీఎల్ జీఏ వారోత్సవాల వేళ ఉనికి కోసం, సంచనాల కోసం మావోయిస్టులు హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదన్న అనుమానాలతో మావోల కదలికలపై నిఘా పెంచారు. పోలీసుల దాడులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాన్ని పెంచుకోనే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ 2000 సంవత్సరం డిసెంబర్ రెండో తేదీన పీపుల్స్ గెరిల్లా ఆర్మీను ఏర్పాటు చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావం పిదప పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కాస్తా 2004 సెప్టెంబర్ 24న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీగా మారింది.