వన్​ నేషన్​ వన్న్ సబ్స్క్రిప్షన్ కు ఆమోదం

రూ. 6 వేల కోట్లు కేటాయింపు ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్ణయం

Dec 3, 2024 - 18:56
 0
వన్​ నేషన్​  వన్న్ సబ్స్క్రిప్షన్ కు ఆమోదం

2 కోట్ల మందికి ప్రయోజనం
నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అవకాశం
ఉన్నత విద్యా వనరులకు ఉచిత యాక్సెస్​

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి రూ. 6వేల కోట్లను కేటాయించింది. దీంతో 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. భారతదేశంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు గొప్ప అవకాశం కల్పించే లక్ష్యంతో ఉన్నత విద్యా వనరులకు ఫ్రీ యాక్సెస్‌ అందిస్తోంది.

దేశంలోని విద్యార్థులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు రీసెర్చ్‌ ఆర్టికల్స్‌, జర్నల్స్‌కు ఫ్రీ యాక్సెస్‌ పొందవచ్చు. ఈ వెసులుబాటు కల్పించేందుకు ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ (ఓఎన్​ఓఎస్​) పథకాన్ని రూపొందిచారు. 

ఉన్నత ప్రమాణాలతో కూడిన అకడెమిక్‌ సోర్సెస్‌ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా విద్య, పరిశోధనలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంది. 

‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ స్కీమ్..

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం అనేది పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫారం. ఈ పథకం ద్వారా రీసెర్చ్‌ ఆర్టికల్స్‌, జర్నల్స్‌కు యాక్సెస్‌ అందించే ప్రత్యేక పథకం. ఇది విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు తమ రంగాల్లో ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండటానికి సహాయ పడుతుంది.

పథకం ఎలా పని చేస్తుంది?..

ఈ పథకం ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్​ అండ్​ డీ) ల్యాబ్స్‌పై దృష్టి సారిస్తుంది. రీసెర్చ్‌ కంటెంట్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా యాక్సెస్ చేయడానికి ఉన్నత విద్యా శాఖ యూనిఫైడ్‌ డిజిటల్ పోర్టల్‌ను క్రియేట్‌ చేస్తుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్​ ఆర్​ ఎఫ్​) ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన భారత రచయితల ప్రచురణలను మేనేజ్‌ చేస్తుంది.

పథకం కోసం నిధులు..

వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకం కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించింది. ఈ నిధులు 2024లో ప్రారంభమై 2027 చివరి వరకు మూడేళ్లపాటు కొనసాగుతాయి. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ పథకం ఫ్రేమ్‌వర్క్ ను రూపొందించారు.

పథకం ప్రయోజనాలు..

ఈ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా 1.8 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు ప్రయోజనం పొందనున్నారు. 6,300 ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ నిర్వహిస్తుంది. ఇది అకడమిక్ నెట్‌వర్కింగ్ అండ్‌ లైబ్రరీ సర్వీసుకు సపోర్ట్‌ చేసే యూజీసీ -సపోర్ట్ ఉన్న స్వయంప్రతిపత్తి సంస్థ.

అందుబాటులో ప్రపంచ స్థాయి ప్రచురణలు..

ఈ పథకం ప్రపంచవ్యాప్త పరిశోధనలకు ఉచిత యాక్సెస్‌ అందిస్తుంది. తద్వారా భారత రాజ్యాంగంలో స్పష్టం చేసిన శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద 30 ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ పబ్లిషర్స్‌కు చెందిన రిసోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇందులో వివిధ రంగాలకు చెందిన దాదాపు 13,000 ఈ–జర్నల్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పథకం దేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు తీసుకువచ్చే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.