మీరు చరణ్‌సింగ్‌ను అవమానిస్తారా?

భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ సందర్భంగా శనివారం ఉదయం రాజ్యసభలో తీవ్ర రభస చోటుచేసుకుంది.

Feb 10, 2024 - 16:07
 0
మీరు చరణ్‌సింగ్‌ను అవమానిస్తారా?

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ సందర్భంగా శనివారం ఉదయం రాజ్యసభలో తీవ్ర రభస చోటుచేసుకుంది. ఈ చర్చలో ప్రతిపక్ష నేతకంటే ముందుగా చౌదరి చరణ్‌ సింగ్ మనవడు, ఆర్‌ఎల్డీ అధినేత జయంత్‌ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ రూల్‌ ప్రకారం జయంత్‌కు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చారని మల్లికార్జున్‌ ఖర్గే సహా కాంగ్రెస్‌ నేతలు చైర్మన్‌ను నిలదీస్తూ ఆందోళనకు దిగారు. దాంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌదరి చరణ్‌సింగ్‌ను, ఆయన వారసత్వాన్ని మీరు అవమానిస్తున్నారంటూ మల్లికార్జున్‌ ఖర్గే, జైరామ్‌ రమేశ్, ఇతర కాంగ్రెస్‌ సభ్యులపై ఆయన మండిపడ్డారు. చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇచ్చేందుకు మీకు టైమ్‌ దొరకలేదా అని విమర్శించారు. రైతుల కోసం పాటుపడిన చరణ్‌సింగ్‌ గురించి చర్చ జరుగుతుంటే అడ్డుకోవడం ద్వారా మీరు దేశ రైతాంగాన్నే అవమానించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలు వాడుతున్న భాష సరిగ్గా లేదని ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. చరణ్‌సింగ్‌ను అవమానిస్తే తాను సహించనని అన్నారు. ఆయన దేశ సమగ్రత కోసం, ప్రజల క్షేమం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.