అదానీపై ఆరోపణలు సరికాదు అమెరికాకు నష్టమే
Allegations against Adani are wrong and it is a loss for America
మాజీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్
ప్రపంచదేశాల్లో గ్రీనరీని పెంపొందించేందుకు చర్యలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అదానీ గ్రూప్ పై అమెరికా జస్టిస్ ఆరోపణలు ఆ సంస్థను మరింత బలోపేతం చేశాయని నార్వే మాజీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమెరికాకు ఈ విషయంలో ఏవైనా ఫిర్యాదులుంటే తొలుత భారత ప్రభుత్వంతో, అక్కడి న్యాయవ్యవస్థ ప్రకారం నడుచుకోవాల్సి ఉండేదన్నారు. కానీ అమెరికా అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అదానీ గ్రూప్ పై అమెరికా కోర్టు ఆరోపణలు సరికాదన్నారు. ప్రపంచ గ్రీనరీ, పర్యావరణ పెంపుదలలో ఆ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. యూఎస్ గ్రీనరీ ఎంత హానికరమైన పరిస్థితుల్లో ఉందో ముందుగా తెలుసుకోవాలన్నారు.
యూఎస్ లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15వేల ఉద్యోగాలు..
అదానీ గ్రూపు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సులువైన, శ్రేయస్కరమైన మార్గాల ద్వారా వ్యాపార, వాణిజ్యాలు, ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సంస్థ పర్యావరణానికి హాని కలిగించని విధంగా వ్యాపారాన్ని విస్తరించుకోవడం హర్షించాల్సింది పోయి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అంతేగాక యూఎస్ ఇంధన భద్రతా కార్యక్రమాలకు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా ప్రకటించిన విషయాన్ని ఎరిక్ సోల్హీమ్ గుర్తు చేశారు. అదానీ గ్రూప్ అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. దీని ద్వారా 15,000 స్థానిక ఉద్యోగాలు కూడా లభించనున్నాయని తెలిపారు.
శాసించే రోజులు గతమే..
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా తన నిరంకుశ విధానాన్ని ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదన్నారు. అమెరికా అర్థరహిత చర్యల పర్యవసానాలు ఆ దేశానికి కూడా విఘాతమే కల్పిస్తాయన్న విషయాన్ని మరువరాదన్నారు. అమెరికా ప్రపంచదేశాలను శాసించే, మధ్యవర్తులు, న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించే కాలం గతమేనని, ప్రస్తుతం కాదన్నారు. అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసిన యూఎస్ అటర్నీ బ్రియాన్ పీస్ రాజీనామాతో అమెరికా చేసింది తప్పేనని స్పష్టం అవుతుందన్నారు.