కువైట్ కు వెలుగులు తీసుకువచ్చారు
Brought light to Kuwait
ప్రవాస భారతీయుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
అల్ అసిమా గవర్నేట్: ప్రవాస భారతీయులు కువైట్ కు రంగులను తీసుకువచ్చారని, ఈ దేశంలో భారత సాంకేతికత, విజ్ఞానాన్ని మిళితం చేస్తూ అభివృద్ధికి పాటుపడటం దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచదేశాల్లో భారత్ ఎకానమీలో అతిపెద్ద భాగస్వామ్యాన్ని పోషించబోతుందన్నారు. ప్రతీ రంగంలోని పెద్ద పెద్ద సంస్థలు, పరిశ్రమలు, హబ్ లు భారత్ లో నెలకొంటున్నాయని తెలిపారు.
శనివారం కువైట్ పర్యటనలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్–కువైట్ నాగరికతలు సముద్రమంతా లోతైనవన్నారు. కువైట్ లో ప్రవాసీయులు మినీ ఇండియానే సృష్టించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను భారతీయులు సాధించిన విజయాలను జరుపుకునేందుకు కువైట్ కు వచ్చానని అన్నారు. కార్మికులు, వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు ఇలా అనేకమంది ప్రవాస భారతీయులు కువైట్ మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ భారతదేశ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. మీ కృషి, నిజాయితీ, సమర్థతను కువైట్ ప్రజలు, తాను, భారత్ ఎంతో గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులు ఇతర దేశాల అభివృద్ధిలో భాగస్వాములవడం నేడు ప్రపంచదేశాలన్నీ చూస్తున్నాయన్నారు. మన గతం, వర్తమానం, భవిష్యత్ కూడా ప్రపంచదేశాలు హర్షించే విధంగా ఉన్నాయన్నారు. కువైట్ నుంచి భారత్ కు గుర్రాలు, ముత్యాలు, ఖర్జురాలు దిగుమతి అవుతుండగా, భారత్ నుంచి కువైట్ కు బియ్యం, టీ, సుగంధ ద్రవ్యాలు, బట్టలు, కలప దిగుమతి అవుతున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార వాణిజ్య బంధాలు లోతైనవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.