పోర్టిఫైడ్​ బియ్యంపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు

జీఎస్టీ 55వ సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​

Dec 21, 2024 - 20:23
 0
పోర్టిఫైడ్​ బియ్యంపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు

ఏసీసీ బ్లాకులపై 12 శాతం సుంకం
రైతు సరఫరాలపై జీఎస్టీ ఉండదు
ఏటీఎఫ్ పై ఏకాభిప్రాయం కుదరలేదు
బీమాపై మరింత సమయం
ఈవీ వాహనాలపై 5 శాతం జీఎస్టీ
విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై నిర్ణయం పెండింగ్​

జైపూర్​: పోర్టిఫైడ్​ బియ్యంపై ఐదు శాతానికి పన్ను తగ్గింపు, జీన్​ థెరపీకి మినహాయింపు, సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, ఎక్విప్‌మెంట్స్, టూల్స్, సాఫ్ట్‌వేర్‌లకు ఇచ్చే జీఎస్టీ మినహాయింపును పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. రాజస్థాన్​ లోని జై సల్మేర్​ లో శనివారం నిర్వహించిన జీఎస్టీ (ప్రీ బడ్జెట్​) 55వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు. ఇన్సూరెన్స్​, బీమాలపై పన్ను తగ్గింపును తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. జన్యుపరమైన చికిత్సలో మినహాయింపు నిచ్చామన్నారు. 

లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎల్​ ఆర్​ ఎస్​ ఎఎం) వ్యవస్థ రక్షణలో చాలా ముఖ్యమైనదన్నారు. సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, ఎక్విప్‌మెంట్స్, టూల్స్, సాఫ్ట్‌వేర్‌లకు ఇచ్చే జీఎస్టీ మినహాయింపును పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో వ్యాపార ఎగుమతిదారులకు సరఫరాలపై పరిహారం సెస్ రేటు 0.1శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. 50 శాతం కంటే ఎక్కువ ఫ్లై యాష్ ఉన్న ఏసీసీ బ్లాకులపై 12 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపారు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయినా, ఎండు ద్రాక్షలు రైతులు సరఫరా చేస్తే జీఎస్టీ విధించబోమన్నారు.

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనే విషయంపై ఏకాభిప్రాయం కుదురలేదన్నారు.  రాష్ర్టాల అభ్యర్థనలపై మరిన్ని చర్చలు అవసరమన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించిన నిర్ణయాలకు మరింత సమయం పట్టనుందన్నారు. 

చెల్లింపు అగ్రిగేటర్‌లు రూ. 2,000 కంటే తక్కువ చెల్లింపులపై జీఎస్టీ నుంచి ఉపశమనం పొందనుండగా, చెల్లింపు గేట్‌వేలు, ఫిన్‌టెక్ సేవలకు ఈ ఉపశమనం కల్పించలేదన్నారు. ఋణ నిబంధనలను పాటించని వారిపై బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) విధించే జరిమానాపై జీఎస్టీ విధించబడదని నిర్మలమ్మ తెలిపారు. వాణిజ్యం, ఇ-కామర్స్, ఫుడ్ డెలివరీ యాప్‌లపై జిఎస్‌టి విధించడంపై కౌన్సిల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అదే సమయంలో పంచదారతో తయారు చేసే వస్తువులను వేరే పన్ను పరిధిలో ఉంచేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచేందుకు వాటిపై 5 శాతం జీఎస్టీ, సెకండ్ హ్యాండ్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ విధించనున్నట్లు పేర్కొన్నారు. సెకండ్​ హ్యాండ్​ ఎలక్ర్టిక్​ వాహనాల లావాదేవీలు వ్యక్తుల మధ్య అయితే దానిపై ఎటువంటి జీఎస్టీ విధించబోమన్నారు. విపత్తు నిర్వహణ నిధులపై సెస్ విధించాలా? వద్దా? అనే అంశంపై మంత్రుల బృందం ఇంకా చర్చిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు.