‘పుష్ప2’ టికెట్ ధరలకు రెక్కలు
Wings for 'Pushpa 2' ticket prices
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప -2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవలే సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నది. ఓవర్సీస్ లో పుష్ప-2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోగా.. ఇండియాలోనూ శరవేగంగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో పుష్ప-2 టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు, అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర సింగిల్ స్క్రీన్, మల్టీ ప్లెక్సుల్లో టికెట్ ధర రూ.800గా నిర్ణయించింది. 6,7 తేదీల్లో అర్థరాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకూ అదనపు షోలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, 9 నుంచి 15వ తేదీ వరకూ టికెట్ పై రూ.105, 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ టికెట్ పై రూ.20 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ప్రకటన విడుదల చేశారు. మల్టీ ఫ్లెక్స్, ఐమాక్స్ లలో డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ టికెట్ పై రూ.200, డిసెంబర్ 9 నుంచి 16 వరకూ టికెట్ పై రూ.150, డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకూ టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరలపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సిందే. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.150 ఉండగా.. పుష్ప 2 చూడాలంటే రూ.300 ఖర్చు చేయాల్సిందే. జీఎస్టీ ఎక్స్ట్రా. మల్టీప్లెక్సుల్లో టికెట్ సుమారు రూ.250 ఉందనుకుంటే.. ఒకరు చూడటానికి రూ.450 చెల్లించాల్సిందే. మొదటివారం పుష్ప -2 చూడాలంటే.. మీ జేబులు, పర్సులు ఖాళీ అవ్వాల్సిందే.