కమలం వైపే పవనాలు
మానవాళికి గుణపాఠం నేర్పుతున్న ప్రకృతి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటాం రాజస్థాన్ చురు ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ
జైపూర్: ప్రకృతి కొన్ని సమయాల్లో మానవాళికి గొప్ప గుణపాఠం నేర్పుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పవనాలు బీజేపీ వైపే వీస్తున్నాయని తెలిపారు. ప్రకృతి ఈసారి కూడా మోదీని ఆశీర్వదిస్తోందన్నారు.
సవాళ్లను ఎదుర్కోవడమే భారతీయ నేల మనకు నేర్పిందని, ఇక్కడి మట్టిలో పుట్టిన ఏ ఒక్క భారతీయుడు సమస్యల పరిష్కారంలో వెనుకడుగు వేయబోడని అన్నారు. రాజస్థాన్చురు ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
దేశాభివృద్ధిలో రాజస్థాన్‌ది కీలకపాత్ర..
దేశమంతా వికసిత్ భారత కోసం పనిచేస్తోందన్నారు. ఇందులో రాజస్థాన్పెద్ద భూమిక పోషిస్తోందన్నారు. దేశంలోని ప్రతీరాష్ర్టం అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ రోజు ప్రపంచమంతా ఆశ్చర్యంలో ఉందన్నారు. భారతీయులు ఒక్కసారి తలచుకుంటే ఆ పనిని పూర్తి చేస్తారని అన్నారు. గత పదేళ్ల కంటే ముందు దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు తెలిసిందే అన్నారు. కాంగ్రెస్‌అవినీతి, అక్రమాలతో దేశ కీర్తి, ప్రతిష్ఠలు ప్రపంచంలో దిగజారుతూ ఉండేవన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇన్నేళ్లైనా చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేశ ప్రజలు కష్టపడుతున్నారన్నారు. నీరు, మరుగుదొడ్లు, సొంతిళ్లు, విద్యుత్, విద్య, వైద్యం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఖజానాను దోచుకున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రతీ ఒక్కరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారని అన్నారు.
దళితులను గౌరవించుకోలేని కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను భారతరత్నతో గౌరవించుకోలేదని విమర్శించారు. కానీ బీజేపీ మాత్రం దళిత మహిళని రాష్ర్టపతిని చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెంచగలిగామన్నారు. చురు ఎంపీ అభ్యర్థి దేవేంద్రుడు నరేంద్రుడి ఆశీస్సులు అడుగుతున్నాడని, తన ఆశీస్సుల కంటే చురు ప్రజల ఆశీస్సులు దేవేంద్రుడుపై ప్రసరింప చేయాలని ఓటర్లకు మోదీ విజ్ఞప్తి చేశారు.
రామమందిరంపై విద్వేషం..
దేశంలోని రామమందిరంపై కూడా కాంగ్రెస్మౌనం దాల్చడమే గాక అయోధ్య నిర్మాణాన్ని ఆపేందుకు అనేక కుట్రలకు పాల్పడిందన్నారు. ఆ కుట్రలన్నీ పటాపంచలు చేస్తూ జఠిలమైన సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించుకోని బాలరాముని ఆలయాన్ని నిర్మించుకోగలిగామన్నారు. ఆహ్వానం అందిస్తే కనీసం ప్రాణప్రతిష్ఠకు సైతం రాకపోవడం వీరి అవివేకానికి నిదర్శనమన్నారు.
భారత్‌ను తలవంచనీయం
తాను భారతదేశాన్ని తలవంచనీయబోనన్నారు. బాలాకోట్‌లో మన సత్తా ఏంటో చూపించగలిగామన్నారు. ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి ఏంటో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఏ దేశాల్లో అభివృద్ధి లేదని, అంధకారం మాత్రమే అలుముకుంటుందన్నది జగమెరిగిన సత్యమని ప్రధాని మోదీ తెలిపారు. దిక్కుమాలిన దేశ వ్యతిరేక పార్టీలు తమ సైనికులు సత్తా చాటితే వాటికి ఆధారాలు అడిగాయని గుర్తు చేశారు. తమ హయాంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛనీయడంతో దేశంలోని సరిహద్దులు సురక్షితం ఉన్నాయని, ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించగలిగారని అన్నారు. సైనిక శక్తిని కాంగ్రెస్ అణగదొక్కిందని విమర్శించారు.
నిరాశ, నిస్పృహలను దరిచేరనీయను..
2014లో నిరుపేద బిడ్డకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. నిరాశ నిస్పృహలను మోదీ దరిచేరనీయడని, దేశ పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నానని మోదీ అన్నారు. నీతి నిజాయితీతో పనిచేశానన్నారు. కరోనా లాంటి విపత్కర స్థితిలో కూడా ధైర్యంతో ముందుకు వెళ్లి మనదేశాన్ని కాపాడుకుంటూ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగలిగామన్నారు. రాజస్థాన్‌లోని 4.5 కోట్లమందికి ఉచిత రేషన్ అందజేస్తున్నామన్నారు. 50 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.
మేనిఫెస్టో కాదు.. తీర్మాణ లేఖ తీసుకొస్తాం..
మోదీ ప్రభుత్వం ఇతర పార్టీల లాగా మేనిఫెస్టోను విడుదల చేయదని స్పష్టం చేశారు. తీర్మాణ లేఖను తీసుకువస్తామన్నారు. మోదీ ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో ఇచ్చిన హామీలన్నీ కేవలం 90 రోజుల్లోనే 40 శాతం వరకు నెరవేర్చామని రానున్న రోజుల్లో వందకు వందశాతం హామీలు నెరవేరుస్తామని మోదీ స్పష్టం చేశారు.