మోదీ లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేరు సీఎం భజన్‌లాల్ శర్మ
ప్రధాని మోదీ లాంటి దేశ హితం కోరే నాయకుడు ప్రపంచంలోనే లేరని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అన్నారు.
జైపూర్: ప్రధాని మోదీ లాంటి దేశ హితం కోరే నాయకుడు ప్రపంచంలోనే లేరని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో ఎన్నికల ర్యాలీ, ప్రచార సభలో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సీఎం శర్మ సభలో మాట్లాడారు. దేశమంతా దీపావళి వేడుకల్లో సంతోషాల మధ్య కుటుంబాలతో గడుపుతుంటే ప్రధాని మోదీ మాత్రం సరిహద్దుల్లోని దేశ సైనికులతో దీపావళి చేసుకుంటారని అన్నారు. ఆయన 140 కోట్ల మందిని తమ కుటుంబ సభ్యులుగా భావించడం చాలా గొప్ప విషయమన్నారు. అందుకు సరిహద్దుల్లో కాపాలా ఉన్న సైనికులతో ప్రధాని పండుగ చేసుకుంటారని తెలిపారు. వారి మధ్య నిరాశ, నిస్పృహలు దరిచేకూడదన్న ప్రధాని ఉద్దేశం గొప్పదన్నారు. నేడు ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మోదీయేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మోదీ నేతృత్వంలో భారత ఆర్థిక వృద్ధిరేటు దినదిన ప్రవర్థమానంగా ఎదగడం సంతోషకరమని తెలిపారు. భారత దేశ కీర్తి పతాకాలను ప్రధాని మోదీ ప్రపంచదేశాల ముందు ఆకాశానికెత్తేశారని సీఎం భజన్‌లాల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.