యూపీలో మరో తెగదెంపులు? సీట్ల పంచాయతీపై ఎస్పీ గుర్రు రిక్త‘హస్తా’నికి సిద్ధం
జోడో యాత్రలో పాల్గొనబోనని తేల్చిన అఖిలేశ్ యాదవ్
లక్నో: ఇండి కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్, ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ)ల మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి రాకపోవడంతో అఖిలేశ్ యాదవ్ తెగదెంపుల దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. యూపీలో సింగిల్ గానే రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. దీంతో హస్తానికి మరోమారు యూపీలోనూ ఎస్పీ రిక్తహస్తాన్నే అందజేయనుంది. సోమవారం అర్థరాత్రి వరకు సీట్ల పంపకాలపై చర్చలు జరిగినా ఓ కొలిక్కి రానట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎస్పీ పార్టీ నిర్ణయాన్ని విబేధిస్తూ, పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ప్రధాన నేత స్వామి ప్రసాద్ మౌర పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ సీట్లను యూపీలో కోరుతోంది. మొరాదాబాద్, సహారన్పూర్, బిజ్నోర్, మీరట్, అమ్రోహా, లక్నో స్థానాలను కాంగ్రెస్ కోరుతోంది. ఈ స్థానాల్లో మంచి పోటీనివ్వగలమని ఎస్పీ భావిస్తోంది. పై అన్ని స్థానాల్లో నుంచి కేవలం మొరాబాదాద్ స్థానం నుంచే ఎస్పీ గెలుపొందినా, గత అభ్యర్థుల ట్రాక్ రికార్డు భేషుగ్గా ఉందని ప్రజలు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని వాదిస్తోంది. మీరట్, లక్నోలో బీజేపీ గత ఎన్నికల్లో విజయఢంకా మోగించింది.
కాంగ్రెస్ పార్టీ పదేపదే జాబితా మారుస్తుండడం తమ అభ్యర్థులకు చెప్పుకోలేక తలకుమించిన భారమవుతోందని ఎస్పీ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ యూపీ భారత్ జోడో యాత్ర కంటే ముందే ఇండికూటమికి మరోమారు బీటలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో తాను పాల్గొనబోనని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయడం కూడా ఇండికూటమి నుంచి వైదొలిగే సంకేతాలే కనిపిస్తున్నాయి