మోదీ గ్యారంటీ అంటే ఇదే..
జమ్మూ: జమ్మూకశ్మీర్ వాసులు 70 ఏళ్లుగా కంటున్న కలలు కలలుగానే మిగిలిపోయాయని, ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలు, జమ్మూలో రూ. 32 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎంఏ స్టేడియంలోని బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు జమ్మూ కశ్మీర్ అంటే ఉగ్రవాదం, తుపాకులు, రాళ్లదాడులని, నేటి జమ్మూకశ్మీర్ అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన అని.. ఇదే మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ప్రధాని పేర్కొన్నారు. అంతకు ముందు కశ్మీర్ లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. 1500 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఎయిమ్స్ ను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ చేరుకోగానే లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఎంఏ మనోజ్ సిన్హా ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితోబాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు.
మోదీకి జయజయధ్వానాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ కు వస్తుండటం తెలుసుకున్న జమ్మూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ప్రధాని వచ్చే దారుల్లో బారులు తీరారు. దారి పొడవునా ప్రధాని మోదీకి జయ జయ ధ్వానాలు, పూల వర్షాలతో స్వాగతం పలికారు. జమ్మూ డివిజన్ లోని పది జిల్లాల నుంచి 1700 వాహనాల్లో వేలాది మంది ప్రధాని బహిరంగ సభకు వచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక బందోబస్తు కల్పించాయి. వీరితోపాటు జమ్మూకశ్మీర్ పోలీసులు భారీగా మోహరించారు.
తెలుగు రాష్ట్రాల్లో
దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలు ట్రిపుల్ ఐటీని జాతికి అంకితమిచ్చారు. నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడంతోపాటు పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.