విశ్వాసం, నమ్మకాలను పెంపొందించేదే ధ్యానం
యూఎన్ లో ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్
న్యూ యార్క్: ధ్యానం ప్రశాంతతను, సంతృప్తిని చేకూరుస్తుందని తద్వారా ప్రపంచ శాంతి సాధ్యమని ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ అన్నారు. ధ్యానం విశ్వవ్యాప్త సత్యాన్ని వెలికితీస్తుందని, మానవుల్లో విశ్వాసం, నమ్మకాలను, సమతుల్యతను పెంపొందిస్తుందన్నారు. శనివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా యూఎన్ (ఐక్యరాజ్యసమితి)లో ప్రారంభోపన్యాసం చేశారు. అంతర్జాతీయ శాంతి, భద్రతకు బెదిరింపులు అనే అంశంపై మాట్లాడారు. ప్రపంచంలో పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో అమాయకులు, పిల్లల పరిస్థితులను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యానం ద్వారా శాంతి లభిస్తుందని, విద్యలో ఈ అంశాలను చేరిస్తే రాబోయే తరాల ఆలోచనల్లో మార్పు చేసుకుంటుందన్నారు. టెన్షన్స్, నెగెటివ్ ఎమోషన్స్, ఏకాగ్రత లాంటి విషయాలపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రపంచదేశాలు ఈ దిశగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధ్యానాన్ని నేడు ప్రపంచదేశాలు ఆదరిస్తున్నాయని ఎన్నో దేశాలు ఈ దినోత్సవాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని రవిశంకర్ అన్నారు.
యూఎన్ భారత ప్రతినిధి పి. హరీష్..
‘ప్రాచీన భారతీయ అభ్యాసం ధ్యానం, యోగ అన్నారు. ఈ రెండు విద్యలు వేలాది సంవత్సరాలుగా భారత సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగమన్నారు. ప్రతీ మనిషి అంతర్గత ప్రశాంతతగా ఇవి ముఖ్యమన్నారు. దీంతో శరీరం, మనస్సు, ఆలోచన, చర్య, సామరస్యం లాంటి వాటిని నియంత్రించవచ్చని హరీష్ తెలిపారు.