భట్టికి నాపై కోపమెందుకు కంటతడిపెట్టిన వీహెచ్
ఎంపీ సీటు రాకుండా భట్టి అడ్డుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణ, హైదరాబాద్: లోక్ సభ–2024 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు భగ్గుమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు, పార్టీలో పరిస్థితిని వివరించారు. తనకు ఈసారైనా ఖమ్మం నుంచి ఎంపీ టిక్కెట్టు కేటాయించాలన్నారు. తాను గెలుస్తానన్నారు. ఎంపీ లిస్టులో తన పేరు రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనమీద భట్టికి ఎందుకింద కక్ష అంటూ వీహెచ్ కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఎంపీ టిక్కెట్టు అడిగితే లోకల్ అనే నినాదాన్ని ముందుకు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారంతా లోకలేనా? అని ప్రశ్నించారు. భట్టి ఈ స్థాయికి రావడంలో తన పాత్ర ఉందని హనుమంతరావు పేర్కొన్నారు. 2019లో కూడా భట్టి ఇలాగే చేశారని తన పేరును ఎంపీ లిస్టులో లేకుండా చేశారని గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు ప్రజాసేవ చేయాలన్న కోరికే తప్ప మరొకటి కాదన్నారు. తనలాంటి చురుకైన నేత పార్టీలో ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు.