బీజేపీది ఉక్కు సంకల్పం

రైతుల కష్టార్జితాన్ని దోచుకున్న కుటుంబ ప్రభుత్వాలు . అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న విపక్షాలు. మోదీది140 కోట్ల కుటుంబం

Mar 10, 2024 - 16:34
 0
బీజేపీది ఉక్కు సంకల్పం

లక్నో: భారతదేశ అభివృద్ధికి ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నానని, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రం దేశ రాజకీయాలను శాసిస్తోందని అదే సమయంలో అభివృద్ధిలో దేశాన్ని పయనింప చేయడంలోనూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆజామ్ గఢ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ దేశంలోనే ఆజామ్​ గఢ్​ ధృవతారలా మెరుస్తోందని చెప్పారు. దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజలంతా ఈరోజు ఆజామ్ ​గఢ్ ​కు రావడాన్ని స్వాగతిస్తున్నానని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికలలో వాగ్ధానాలు ఇచ్చేవే కానీ అమలు చేసేవి కావన్నారు. కానీ తమ ప్రభుత్వం ముందుగా అభివృద్ధి పనులను చేశాకే ఎన్నికలకు వెళుతోందని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పాలించిన కుటుంబ పార్టీలు రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నాయన్నారు. మోదీ కుటుంబం 140 కోట్ల పెద్ద పరివారమని ప్రధాని తెలిపారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. 2047 వరకు అభివృద్ధి చెందిన భారత్​ లక్ష్యంగా పనుల్లో వేగాన్ని పెంచి ముందుకు వెళ్తున్నామన్నారు. దీని కోసం దేశ ప్రజలంతా తమ ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

రూ. 34,700 కోట్లతో అభివృద్ధి పనులు..


యూపీలోని ఆజామ్ ​గఢ్ ​నుంచి రూ.34,700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. పౌర విమానయాన రంగానికి పెద్ద పీట వేస్తూ, దేశ వ్యాప్తంగా ఆజామ్ ​గఢ్​ వేదికగా రూ. 9800 కోట్లతో 15 ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుల‌ను ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో పూణే, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఢిల్లీ, లక్నో, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తి, అధంపూర్ విమానాశ్రయాలలో 12 కొత్త టెర్మినల్ భవనాలను వర్చువల్ ​గా ప్రధాని ప్రారంభించారు. కడప, హుబ్బళ్లి, బెళగావి విమానాశ్రయాల్లో మూడు కొత్త టెర్మినల్ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.3700 కోట్లతో గ్రామ సడక్​ యోజన కింద 700 రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. 

నూతనాధ్యాయాన్ని లిఖించనున్న ఆజామ్ ​గఢ్..


వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తర్వాత జరిగిన బహిరంగ సభలో దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అభివృద్ధిలో ఆజామ్ గఢ్​ నూతనాధ్యాయాన్ని లిఖించుకోవడం ఖాయమన్నారు. ఇక్కడి అభివృద్ధి పనుల ప్రారంభాలు చూసి విపక్షాలు కుళ్లుకుంటున్నాయన్నారు. ఒకేసారి ఇంతపెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వం అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. తామేమీ ఎన్నికల స్టంట్​లు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వాలు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చాక కనిపించకుండా పోయేవన్నారు. కానీ తాము ముందుగా అభివృద్ధి చేసి చూపించి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికి తేడా ఇదే అన్నారు. ఆజామ్​ గఢ్​ యువత ఉన్నత విద్య కోసం వారి తల్లిదండ్రులపై ఆర్థికభారం పడేదని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ కొరతను తీర్చామన్నారు. ఇక్కడి యువత ఇక ఉన్నత విద్య కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదన్నారు. ఆజామ్ ​గఢ్​ యూనివర్సిటీలోనే ఉన్నత విద్యనభ్యసించుకోవచ్చని ప్రధాని తెలిపారు. రాబోయే సమయంలో ఉత్తరప్రదేశ్​ దేశ రాజకీయాలను శాసిస్తోందని, అదే సమయంలో దేశాభివృద్ధిని కూడా ఇనుమడింప చేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.