బీజేపీకి కలిసి రానున్న చంపై చేరిక
ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం
గతం కంటే కలిసిరానున్న స్థానాలు
హేమంత్ వర్గంలో గుబులు..
చంపై వర్గంలో ఆగ్రహం
ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం
చండీగఢ్: ఝార్ఖండ్ ఎన్నికల ప్రకటన అనంతరం పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ రాష్ర్ట అసెంబ్లీలో 81 స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ స్థానాలు 41. 2019 ఎన్నికల్లో జేఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) 30 సీట్లు 19 శాతం ఓట్లు, బీజేపీ 25 సీట్లు, 33.8 శాతం ఓట్లు, కాంగ్రెస్ 16 సీట్లు 14.1 శాతం ఓట్లు, జేవీఎం 3, 5.5 శాతం, అజూస్ 2, 8.2, ఇతరులు 2, 6.6 శాతం, స్వతంత్రులు 3, 12.8 శాతం ఓట్లను స్వాధీనం చేసుకున్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలతో కూటమిగా ఏర్పడి 47 స్థానాలకు కైవసం చేసుకొని హేమంత్ సోరెన్ సీఎం పదవిని చేపట్టారు.
అనంతరం జరిగిన పరిణామాలలో అవినీతి ఆరోపణలపై హేమంత్ జైలుకు వెళ్లడం, ఆ పార్టీ సీనియర్ నాయకుడు చంపై సోరెన్ సీఎం పదవిని అధిష్ఠించడం, జైలు నుంచి హేమంత్ విడుదల కావడం, చంపైని తప్పించి మళ్లీ సీఎం సీటుపై ఆసీనులు కావడం, చంపై రాజీనామా, బీజేపీలో చేరిక లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం బీజేపీ చేరిన చంపై కూడా హేమంత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, ఈయన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 14 స్థానాల్లో 2019లో 11 స్థానాలను జేఎంఎం గెలుపొందింది. దీంతో ఈసారి జేఎంఎం కూటమికి ఎదురు దెబ్బ తగలనుందనే వాదనలున్నాయి. అదీగాక ఈ 14 స్థానాల్లో హేమంత్ కంటే చంపైకే ఎక్కువ పట్టు ఉంది. ఈ నియోజకవర్గాల్లోని పలు చంపై వర్గానికి చెందిన నాయకులు సీఎం పదవి నుంచి ఆయన్ను తప్పించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఆ ఆగ్రహం కాస్త జేఎంఎంపై చూపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం బీజేపీకి బాగా కలిసి రానుంది. ఇప్పటికే స్థానాలు తక్కువైనా ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే అన్ని పార్టీల కన్నా ఎక్కువగా బీజేపీకి 33.8 శాతంగా నమోదైంది. చంపై రాకతో ఈ శాతం 50కి పైగా పెరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే ఝార్ఖండ్ లో వార్ వన్ సైడ్ గానే నిలవనుంది.