కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోసిన ప్రధాని
హస్తం హయాంలో అసురక్షితంగా ప్రజలు
ధైర్యంతో ముందుకెళ్లేలా చర్యలు
యువత ధైర్యంగా నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాలాన్ని మార్చాం, ఉగ్రవాదులకు వారి ఇళ్లలోనే దడ పుట్టిస్తున్నాం, భారత్ పై కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడే వారి ఇళ్లలోకి చొరబడి కొడతాం అని ప్రధాని మోదీ మరోసారి గర్జించారు. ముంబై 26/11 దాడుల పరిస్థితులను, నివేదికలను చూశానన్నారు. శనివారం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనాతీరుపై దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్ హయాంలో ప్రజలు అసురక్షితంగా ఉండేవారన్నారు. తీవ్రవాద, ఉగ్రవాద దాడులతో బిక్కుబిక్కుమంటూ గడిపేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు. దీంతోపాటు యువత ఆలోచనా రీతిలో మార్పు తీసుకువచ్చి ధైర్యాన్ని నూరిపోశామన్నారు. గత ప్రభుత్వాలు బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని భ్రష్ఠు పట్టించాయన్నారు. పదేళ్లలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడోసారి కూడా వారి ఆశీర్వాదాన్ని దక్కించుకోగలిగామన్నారు. భారత్ ప్రస్తుతం అపూర్వమైన ఆకాంక్షలతో, ఆశలతో పయనిస్తుందన్నారు. తమ పాలనా విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు.
దేశంలో యువత రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించామన్నారు. యువత ఏదైనా చేద్దామనుకుంటే వారికి ప్రోత్సాహం కల్పించామన్నారు. వారిలో మనోధైర్యాన్ని మోదీ ప్రభుత్వం నింపిందన్నారు. ప్రస్తుతం 1.25 లక్షల స్టార్టప్ లు రిజస్టర్ అయ్యాయని మోదీ తెలిపారు. ఇది భారత్ యువతకే గాక దేశానికి గర్వకారణమన్నారు. గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛత, ఉచిత రేషన్, ఆర్థిక వృద్ధి, నిరుపేదలకు సౌకర్యాలు, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారు.