ఇంకా లభించని 8మంది శిశువుల ఆచూకీ
12గంటల్లో నివేదిక అందించాలన్న సీఎం యోగి
లక్నో: యూపీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాంలో 10మంది నవజాత శిశువులు సజీవ దహనం కాగా, మరో 8 మంది ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. శుక్రవారం అర్థరాత్రి ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సియు)లో మధ్యరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన పలువురు ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రిలోకి రోగులు, కుటుంబ సభ్యులు కిటికీలు పగులగొట్టి 39 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు. శనివారం ఉదయం ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద యెత్తున ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
ఆక్సిజన్ సిలీండర్లు ఉన్న గదిలో మంటలు చెలరేగి ఆసుపత్రి అంతా వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు వాహనాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నరు. కిటికీలు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. మధ్యరాత్రికి మంటలు అదుపులోకి వచ్చాయి.
ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టి 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని కమషనర్, డీఐజీలను ఆదేశించారు. మరోవైపు వేకువజామున ఆసుపత్రి ప్రాంగణానికి డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ వచ్చారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు, ఆరోగ్యశాఖ, మేజిస్ర్టేట్ ల ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు.