డేంజర్​ జోన్​ లో ఢిల్లీ 495కు ఎక్యూఐ

ACI for Delhi 495 in the danger zone

Nov 18, 2024 - 12:41
 0
డేంజర్​ జోన్​ లో ఢిల్లీ 495కు ఎక్యూఐ

శ్వాస, కళ్లలో మంటలతో ప్రజల ఇబ్బందులు
సుప్రీం మొట్టికాయలు
మంత్రి అత్యవసర సమావేశం
పాఠశాలలకు ఆన్​ లైన్​ క్లాసులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్​ ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లలో మంటలతో కాలుష్య ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం, సోమవారం ఉదయం నమోదైన కాలుష్య తీవ్రతను వాతావరణ శాఖ ఎక్యూఐ విడుదల చేసింది. 
ఢిల్లీలోని ఆనంద్​ విహార్​ 487, బవానా - 495, ముండ్కా - 495, షాదీపూర్ - 477, ద్వారకా సెక్టార్-8 500, జహంగీర్‌పురి 487, పంజాబీ బాగ్‌లో 495, గురుగ్రామ్ 446, ఫరీదాబాద్‌లో 320, నోయిడా 384, ఘజియాబాద్‌ 404, వసుంధర 432 లలో కాలుష్యం నమోదైంది. 

కాలుష్యంతోపాటు భారీగా పొగమంచు కారణంగా 150 మీటర్ల మేర రోడ్డు కనిపించకపోవడంతో ఉదయం పూట ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరం అయితే వేగాన్ని తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. పాఠశాల విద్యార్థులకు ఆన్​ లైన్​ క్లాసులు అందించాలని ఆదేశించింది. పొగమంచు కారణంగా పలు విమాన, రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

కోర్టు మొట్టికాయలు..
మరోవైపు కాలుష్య నివారణపై విఫలం కావడంతో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్​ అయింది. దేశంలోనే అత్యంత కాలుష్య కారకంగా దేశ రాజధాని నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని నిలదీసింది. ప్రజల ప్రాణాలకు కాలుష్యభూతం హరించేలా నమోదవుతున్న ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చుంటుందా? అని న్యాయమూర్తులు నిలదీశారు. వెంటనే ఎక్యూఐ తగ్గించే చర్యలను పటిష్టంగా చేపట్టాలన్నారు. 

అధికారులతో మంత్రి భేటీ..
సుప్రీం మొట్టికాయలతో పర్యావరణ మంత్రి గోపాల్​ రాయ్​ అధికారులతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన అన్ని మార్గాలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం తగ్గకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన చర్యలపై అధికారులకు వివరించారు. 

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం ఢిల్లీని కమ్ముకోవడాన్ని మాత్రం ఆపలేక సాగిలపడుతోంది.