వయోనాడ్​ ప్రకృతి ప్రకోపం.. గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

పలు జిల్లాలకు ఐఎండీ రెడ్​ అలర్ట్​  ప్రతికూల పరిస్థితుల్లోనే సహాయక చర్యలు 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు రెండు రోజులపాటు సంతాప దినాలు టీ ఎస్టేట్​ లో 600మంది గల్లంతు? 400 ఇళ్లు పూర్తిగా ధ్వంసం

Jul 30, 2024 - 21:37
 0
వయోనాడ్​ ప్రకృతి ప్రకోపం.. గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

వయోనాడ్​: వయోనాడ్​ భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో గంటగంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 119గా అధికారులు ప్రకటించారు. మరోవైపు ఐఎండీ అలర్ట్​ జారీ చేయడంలో 8 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో రెస్క్యూ చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. ముండక్కై, చురలమల, అట్టమల, నూలప్పుజ గ్రామాలు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో 116 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. వారంతా స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. మరో 98 మంది ఆచూకీ లభించలేదని అధికార బృందాలు తెలిపాయి. సహాయక చర్యల్లో ఎస్డీఆర్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​, ఆర్మీ, వైమానిక దళాలు పాల్గొంటున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు కోజికోడ్​ కు తిరిగి వెళ్లాయి.  మరోవైపు డాగ్​ స్క్వాడ్​ బృందాల సహాయంతో మృతదేహాలను వెలికితీసేందుకు, బురదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు వయోనాడ్​ లోని టీ ఎస్టేట్​ లో పనిచేస్తున్న 600మంది కార్మికులు గల్లంతయ్యారు. వరదలకు చలయార్​ నదిలోకి మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. 

400కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికార వర్గాలు గుర్తించాయి. ముండక్కైలో చిక్కుకున్న 250 మందిని రక్షించేందుకు కాలినడకనే 20మంది ఎన్డీఆర్​ఎఫ్​ బృందం వెళ్లింది. అక్కడికి చేరుకునేందుకు వీరికి తీవ్ర ప్రతిబంధకాలు ఎదురయ్యాయి.