విస్మరించిన వారే విమర్శించడం విడ్డూరం

It is ironic to criticize those who ignore it

Jul 30, 2024 - 20:56
 0
విస్మరించిన వారే విమర్శించడం విడ్డూరం
  • ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
  • తెలంగాణకు నిధులు కేటాయించాం
  • కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులు కేటాయింపు
  • తెలంగాణ, మహారాష్ట్రలలో డబ్లింగ్ పనులకు నిధులు  
  • ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదు
  • తమ నినాదం ఇండియా ఫస్ట్  

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ : నాడు విస్మరించిన వారే ఈరోజు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు. బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర మంత్రులు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తున్నారన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో స్పందించారు. తెలంగాణ సహా ఏ రాష్ట్రానికి ఏం ఇచ్చామో వివరించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదనడాన్ని ఖండించారు.

పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులకు రూ.700కోట్లు..

కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులు కేటాయించామని కేంద్రమంత్రి వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామన్నారు.

ఏపీ, తెలంగాణ రైల్వే సెక్షన్లకు రూ.12,334కోట్లు..

ఏపీ, తెలంగాణలో మోటుమర్రి- విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు, మడికేర్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ మార్గంలో డబ్లింగ్ పనులకు, భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు మొత్తం రూ.12,334 కోట్లతో రైల్వే పనులకు నిధులు ఇచ్చామన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో రూ.1900 కోట్లతో బ్క్ డ్రగ్ పార్కులు ప్రకటించినట్లు చెప్పారు. కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించామన్నారు. తాము ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని చెప్పారు. తమ నినాదం ఇండియా ఫస్ట్ అన్నారు. కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళకు కూడా నిధులు ఇచ్చామన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ధ్యేయం..

ఎన్డీయేకు వరుసగా మూడోసారి అధికారం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. మోదీపై ప్రజలు మూడోసారి విశ్వాసం ఉంచారన్నారు. స్థిరత్వం, ప్రజాశ్రేయస్సు విధానాలను తీసుకున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ధ్యేయమన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికస్ స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు.

యూపీఏ ఆ రాష్ట్రాలను విస్మరించింది..

2009–-10 బడ్జెట్‌లో బీహార్, యూపీకి నాటి యూపీఏ ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీహార్, ఏపీపై ఆరోపణలు చేస్తున్నవారు దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 2009–10 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల ప్రస్తావన నాటి బడ్జెట్‌లో లేదని విమర్శించారు. 2010-–11 బడ్జెట్‌లో 11 రాష్ట్రాలను, 2011–-12లో 15 రాష్ట్రాలను, 2012-–13లో 16 రాష్ట్రాలను, 2013-–14లో 10 రాష్ట్రాలను విస్మరించారన్నారు. నాడు విస్మరించిన వారే ఈరోజు తమను విమర్శించడం విడ్డూరమన్నారు. బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర మంత్రులు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తున్నారన్నారు.