ఫుట్​ బాలర్​ అవుదామనుకుని షూటింగ్​ ఎంచుకున్న సరబ్​

Sarab thought he was a football player and chose shooting

Jul 31, 2024 - 00:08
 0
ఫుట్​ బాలర్​ అవుదామనుకుని  షూటింగ్​ ఎంచుకున్న సరబ్​
– ఎన్నో పతకాలు, మరెన్నో రికార్డులు ఆయన సొంతం 
– ఒలింపిక్​ పతకం కూడా దాసోహం 
 
మూడు రోజుల క్రితమే కలలను చిదిమేసే ఓటమి ఎదుర్కొన్న ఓ ఆటగాడు.. దాని నుంచి పుంజుకొని ఒలింపిక్ పతకాన్ని సాధించడం అసామాన్యం. ఏకాగ్రత, ప్రశాంతతను కోల్పోకుండా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు షూటర్ సరబ్ జోత్ సింగ్. వెంట్రుక వాసిలో 10 మీటర్ల ఎయిర్​ పిస్తోల్​ విభాగంలో తుదిపోరు బెర్తును కోల్పోయాడు.కానీ, పోయిన దగ్గరే వెతుక్కోవాలే అన్న చందంగా పారిస్​ ఒలింపిక్స్​ లో పతకాన్ని ఒడిసిపట్టాడు. 
నా తెలంగాణ, శాతోవు, (ఫ్రాన్స్​)
  పారిస్​ ఒలింపిక్స్​ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగం తుది పోరులో బెర్త్​ ను తృటిలో కోల్పోయాడు. కానీ, పోరాటపటిమ వీడలేదు. అవకాశం ఉన్న మిక్స్ డ్​ డబుల్స్​ విభాగంపై పూర్తిగా దృష్టి పెట్టాడు. చివరికి అనుకున్నది సాధించాడు. సరబ్ జోత్ సింగ్ ఈ విభాగంలో గగన్​ నారంగ్​, విజయ్ కుమార్ తర్వాత పతకం సాధించిన మూడో భారత షూటర్​ గా చరిత్రకెక్కాడు.  కచ్చితంగా గగన్ నారంగ్ కాంస్య పతకం గెలిచిన 2012 జులై 30 నాటి నుంచి 12 ఏళ్ల తర్వాత అదే తేదీన సరబ్​ విజయభేరి మోగించాడు. 
 
ఫుట్​ బాలర్​ అవుదామని..
హరియాణలోని అంబాలా సమీపంలోని థేన్ గ్రామానికి చెందిన జతీందర్ సింగ్-హర్దీప్ కౌర్ దంపతులకు సరబ్ జోత్ సెప్టెంబర్ 2001న జన్మించాడు. తండ్రి రైతు. చిన్నప్పటి నుంచి ఫుట్​ బాలర్ కావాలని సరబ్ జోత్ కలలు కన్నాడు. కానీ, అతడి లక్ష్యాలు వేగంగా మారిపోయేవి. 13 ఏళ్ల వయస్సులో ఒక సారి సమ్మర్ క్యాంప్ పిల్లలు పేపర్ టార్గెట్లను గురిపెట్టడం చూసి పిస్తోల్ షూటింగ్​ పై ఆసక్తి పెంచుకున్నాడు. తన తండ్రి వద్దకు వెళ్లి 'నాన్న, నేను షూటింగ్​ నేర్చుకోవాలనుకుంటున్నాను" అని చెప్పాడు. రైతు అయిన ఆ తండ్రి ఈ క్రీడ చాలా ఖరీదైనదని అతనికి చెప్పాడు. కానీ చివరికి, సరబ్ జోత్ మక్కువను, మొండితనాన్ని కాదనలేక పిస్తోల్​ కొనిచ్చారు. తొలుత జిల్లా స్థాయిలో రజత పతకం సాధించడంతో కుమారుడిలో ప్రతిభ ఉందని గుర్తించారు. ఈ విజయం అతడి జీవితాన్ని మార్చింది. అభిషేక్ రాణా పర్యవేక్షణలో ప్రొఫెషనల్ కోచింగ్ మొదలైంది. చండీగఢ్ డీఏవీ కళాశాలలో సరబ్ చదువుకొన్నాడు. అతడి శిక్షణ మొత్తం అంబాలాలోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో సాగింది. 
 
ఆసియా క్రీడల్లో స్వర్ణం..
సరబ్ ఒక పెద్ద ఈవెంట్లో దేశం గర్వపడేలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో చైనాలోని హాంగ్ జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకున్న అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ లతో కూడిన భారత త్రయంలో సరబ్ జోత్ ఒకరు. అలాగే, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్​ టీమ్ ఈవెంట్​ లో దివ్య తో భారత్​ కు రజతం అందించాడు. 
 
సరబ్ జోత్ విజయాలు
 
• 2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్​ లో స్వర్ణ పతకం సాధించడంతో సీనియర్ ర్యాంకింగ్స్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు వ్యక్తిగత విభాగం, మిక్స్ డ్​ టీమ్ విభాగంల్లో రజత పతకాలను అందుకున్నాడు.
• అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్​ లో కూడా బంగారు పతకం సాధించాడు. 
• 2022లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్​ లో రెండు స్వర్ణాలను గెలుచుకొన్నాడు.
• 2023 ఆసియా ఛాంపియన్ షిప్స్ కాంస్య పతకం సాధించి.. ఒలింపిక్స్​ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
2022 ఆసియా క్రీడల్లో మిక్స్​ డ్​ టీమ్ ఈవెంట్ లో రజతం నెగ్గారు. 
2023 భోపాల్ ప్రపంచ కప్​ లో మెన్స్​ సింగిల్స్​ లో  గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. 
2023  ప్రపంచ కప్ లో మిక్స్​ డ్​ డబుల్స్​ లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 
2023 చాంగ్వాన్ ఆసియా ఛాంపియన్ షిప్​ లో కాంస్యం సాధించాడు. 
2019 దోహా ఆసియా ఛాంపియన్​ షిప్​ లో మిక్స్​ డ్​ డబుల్స్​ లో స్వర్ణం 
2019 సుహ్ల్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో జూనియర్ మెన్స్​ లో బంగారు పతకం గెలుచుకున్నాడు. 
2019 జర్మనీ జూనియర్ ప్రపంచ కప్ లో మెన్స్​ సింగిల్స్​ లో రజతం, మెన్స్​ టీమ్​ లో 
 స్వర్ణం, మిక్స్​ డ్​ డబుల్స్​ లో రజతం నెగ్గారు.