సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి పోటీ లేరు: పుష్కర్ సింగ్ ధామీ
Uttarakhand CM Pushkar Singh Dhami said that there is no competition for Kishan Reddy in Secunderabad
- కారు.. కార్ఖానా పోయింది.. చేతి పని అయిపోయింది
- తెలంగాణలో బీజేపీదే గెలుపు: పుష్కర్ సింగ్ ధామీ
- సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి పోటీయే లేదు
- మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలి
- బీజేపీ యువ సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం కామెంట్స్
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలో కారు కార్ఖానాకు పోయిందని, చేయి పని అయిపోయిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. తెలంగాణలో కమల వికాసం కనిపిస్తున్నదని, బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ముషీరబాద్ లో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనంలో ధామీ పాల్గొని మాట్లాడారు. ‘‘మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలి. కిషన్ రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించాలి. పార్టీలో కిషన్ రెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించారు. గత 45 ఏళ్లుగా ప్రజాజీవనంలో నిష్కళంకంగా సేవ చేస్తున్న కిషన్ రెడ్డికి మించిన సరైన అభ్యర్థి ఇంకెవరుంటారు? ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించాను. ఆ పరిస్థితులు చూస్తుంటే.. ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దేశమంతా మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేస్తోంది. 13వ తేదీ ఎన్నికల కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి పోటీయే లేదు. ఆయన గెలుపు ఖాయం. ఇందులో సందేహం లేదు. మోదీ గెలుస్తారు, కిషన్ రెడ్డి గెలుస్తారని మనకు అర్థమైంది. నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందనే అలసత్వం మాత్రం వద్దు. కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లండి. కిషన్ రెడ్డికి ఓటేయండి. ఇతరులతో ఓటు వేయించండి”అని పుష్కర్ సింగ్ ధామీ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలు..
తెలంగాణలో కారు.. కార్ఖానాలోకి పోయిందని, చేతి పని అయిపోయిందని, కమల వికాసం కొనసాగుతోందని పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. ‘‘మేం ఉత్తరాఖండ్ లో ‘ల్యాండ్ జిహాద్’పై కఠినంగా చర్యలు తీసుకున్నాం. 5 వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నాం. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలి. అందుకే మేము యూసీసీని తీసుకొచ్చాం. ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచాం. అంబేడ్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తామంటోంది కాంగ్రెస్. తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని మోదీ చెబుతున్నారు. అంతకన్నా గ్యారంటీ ఇంకే కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడుదొంగలు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? మహిళలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి ఇచ్చిందా? యువతకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామన్నారు ఏమైంది? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. రాజకీయాల్లో కిషన్ రెడ్డి వంటి మంచివ్యక్తి దొరకరు. అందుకే ఆయనను గెలిపించి మోదీకి మద్దతు ఇవ్వండి”అని ధామీ కోరారు.