జల సంరక్షణ విధానం కాదు సామాజిక బాధ్యత
జల్ సంచయ్ జన్ భాగీదారిలో ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జల సంరక్షణ అనేది కేవలం ఒక విధానం కాదని, ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన సామాజిక బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సింగపూర్ పర్యటన విజయవంతమైన మరుసటి రోజు శుక్రవారం మోదీ గుజరాత్ సూరత్ లో జలసంరక్షణ కార్యక్రమం ‘జల్ సంచయ్ జన్ భాగీదారి’ అనే కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించి ప్రసంగించారు. రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్ ను అందించేందుకు నీటి సంరక్షణ అత్యంత ముఖ్యమైందన్నారు. భవిష్యత్ తరాలను జ్ఞప్తిలో పెట్టుకొని మనం ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి సంరక్షణ అనేది మానవాళి మనుగడలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నారు. జలం లేకుంటే మానవాళి మనుగడే లేదన్నారు. జలమే జీవితమని ప్రధాని తెలిపారు. భారతదేశ సంస్కృతిలో జలసంరక్షణ ఒక భాగమని గుర్తు చేశారు. ఆది నుంచి బావుల ద్వారా కావాల్సిన మేరకే నీటిని వాడుకుంటూ మిగతా నీటిని సంరక్షించే విధానాన్ని గుర్తు చేశారు. భవిష్యత్ లో జల సంరక్షణ కోసం ‘అటల్ భుజల్ యోజన’ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దీంతో నీటికొరత తగ్గుతుందని తెలిపారు. నీటి కొరతను తీర్చేందుకు నూతన సాంకేతికత అవలంభించే పద్ధతులను ఈ యోజన ద్వారా తెలుసుకోవచ్చన్నవారు. నీటిని కాపాడుకోవాల్సిన అత్యవసరం మానవాళికి ఉత్పన్నమైందని ప్రధాని వివరించారు. జల్ సంచయ్ జన్ భాగీదారి ద్వారా 24,800 వాటర్ హార్వెస్టిక్ స్ట్రక్చర్ నిర్మాణం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.