అధ్యక్షుడు మొయిజ్జుతో ప్రధాని మోదీ భేటీ
కీలక నిర్ణయాలపై ఒప్పందాలు పూర్తి
అడ్డూ, బెంగళూరులలో కాన్సులేట్ ల ప్రారంభం
ఏక్తా హార్బర్ పనులు వేగవంతం
కొలంబో సెక్యూరిటీ కాన్ క్లేవ్ లో మాల్దీవులుకు స్వాగతం
ఆ దేశ పర్యాటక రంగంపై మోదీ హామీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–మాల్దీవులు మధ్య సంబంధాలు శతాబ్ధాల నాటివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మాల్దీవులు భారత్ కు సన్నిహిత మిత్రుడన్నారు. సోమవారం న్యూ ఢిల్లీలో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూతో ప్రధాని భేటీ అయి పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ భారత్–మాల్దీవుల మధ్య యూపీఐ లావాదేవీలు ప్రారంభించామన్నారు. రక్షణ, భద్రత సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో కలిసి నడవాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీని మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్చలు ఫలప్రదమయ్యాయని ప్రకటించారు.
మాల్దీవులతో యూపీఐ, రూపే కార్డు ద్వారా లావాదేవీలు ప్రారంభం కావడం సంతోషకరమని ప్రధాని తెలిపారు. దీంతో ఇరుదేశాల ఆర్థిక సంస్కరణలు వేగంగా నిర్వహించవచ్చని తెలిపారు.
భారత్, మాల్దీవులు అడ్డూలో భారత కాన్సులేట్, బెంగళూరులో మాల్దీవుల కాన్సులేట్‌లను ప్రారంభించడంపై కూడా చర్చించారు. ఏక్తా హార్బర్ పనులు మరింత శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పని చేస్తామని ప్రధాని తెలిపారు. కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో వ్యవస్థాపక సభ్యులుగా చేరేందుకు మాల్దీవులును ప్రధాని స్వాగతించారు. ఈ సందర్భంగా భారత్–మాల్దీవులు మధ్య ప్రభుత్వ బాండ్లు, కరెన్సీ స్వాప్ వంటి పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మాల్దీవులులో భారత్ పెట్టుబడులు పెంచేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాల బంధం బలోపేతంతో మాల్దీవులుకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.