అపరిపక్వ నేత బాబా

Baba is an immature leader

Sep 6, 2024 - 15:14
 0
అపరిపక్వ నేత బాబా
‘రాహుల్​’కు రాజకీయ పరిణితేదీ?
ఆర్టికల్​ 370పై మౌనమేల?
పెన్షన్​ విధానంపై ద్వంద్వ వైఖరి
సీఏఏపై వ్యతిరేకత
కులగణన నివేదికలను బయట పెట్టలేని అసమర్థ నాయకుడు
దళిత రిజర్వేషన్లపై హర్షం ప్రకటన కూడా చేయరా?
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:

ఆది నుంచి రాహుల్​ గాంధీకి రాజకీయ పరిణితి లేదన్న ఆరోపణలు కొన్ని విషయాలను ఆలోచిస్తే నిజమేననిపించక మానదు. ఆయన దాటవేత ధోరణి, అనుసరించే విధానాలు, ప్రసంగించే తీరు, నడవడిక, విదేశాల్లో పర్యటనలపై వచ్చిన ఆరోపణలు తదితరాలపై ఆయన స్పందించే తీరు పలుమార్లు కాంగ్రెస్​ వర్గాలనే ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేయడం కొసమెరుపు. కొందరు కాంగ్రెస్​ నేతలే పలుమార్లు అంతర్గతంగా ఈ అపరిపక్వత నేత కాంగ్రెస్​ ఎలా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేశారు. 
 
ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశంపై ఐక్యత విచ్ఛిన్నత కోసం ఆయన చేయని ప్రయత్నమే లేదనేది పలు విషయాలను గమనిస్తే తెలిసిపోతుంది. బీజేపీ రద్దు చేసిన ఆర్టికల్​ 370 రద్దుపై ఓ మారు రద్దు చేయవద్దని, తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్​ ను తీసుకువస్తామని చెప్పారు. తీరా జమ్మూకశ్మీర్​ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని ఇటీవల ఆ ప్రాంత పర్యటనలో అసలు ఆర్టికల్​ 370 ఊసే ఎత్తకపోవడం గమనార్హం. పైగా ఈ 370పై కీలక సమయంలో తాము తీసుకోబోయే స్టాండ్​ ను బహిర్గతం చేస్తే సొంత పార్టీ ఓట్లు కూడా గల్లంతవుతాయనే కామ్​ గా ఉన్నారు. అదే సమయంలో 370పై ఎన్సీపీ నాయకులతో మాత్రం ప్రతీ కార్యక్రమంలో ప్రకటింప చేస్తుండడం విశేషం. 
 
ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన సైనికులకు పెన్షన్​ విధానం. ఈ విధానంలోనూ పదేళ్ల యూపీఏ హయాంలో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్​ సొంతంగా తీసుకోలేక చతికిలపడింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్ని అవాంతరాలు ఎదురైనా అన్నింటినీ పక్కన పెట్టి దేశ సైనికులకు మేలు జరిగే పెన్షన్​ విధానాన్ని ఒంటిచేత్తో తీసుకురాగలిగారు. అయితే ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో పాత పెన్షన్​ విధానంపై కూడా కాంగ్రెస్​ పార్టీ రాహుల్​ బాబా స్పష్టమైన ప్రకటన చేయలేక రెండోసారి చతికిలపడ్డారు.
 
ఇక అత్యంత కీలకమైన సీఏఏ (పౌరసత్వం) విషయంలోనూ బాబా వైఖరి ఎవ్వరికీ అర్థం గాకుండానే ఉంటుంది. సీఏఏపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం బయటి దేశాల్లో ఉండిపోయిన పలువురు హిందువులు అక్కడి హింసను తట్టుకోలేక అన్నమో రామచంద్ర అంటూ ఎలాగోలా ఇక్కడకు వచ్చి శరణు తీసుకున్నారు. అలాంటి వారు తమకు భారత పౌరసత్వాన్ని కల్పించాలని ఎన్నాళ్లుగానో వేడుకుంటున్నారు. యూపీఏ హయాంలోనూ ఈ నిర్ణయం తీసుకోకపోగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వారందరికీ పౌరసత్వం ఇస్తుంటే అవాకులు చవాకులు పేలుతూ మూడోసారి కాంగ్రెస్​ పార్టీ పరువును బజారుకీడ్చినట్లయ్యింది. ఇక్కడ కూడా రాహుల్​ బాబా దేశంలో ఒకలా తాము అధికారంలో ఉన్న ప్రాంతాల్లో మరోలా వ్యవహరించారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో సీఏఏ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. 
 
ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాని మోదీ నిర్ణయం దళిత కోటా(ఎస్సీ రిజర్వేషన్​). గత ఎన్నికల్లోనే మోదీ దీనిపై స్పష్టతనిచ్చి పలువురు దళిత ప్రముఖులను కలిసి సుప్రీంకోర్టులో గట్టిగా వాదించేలా పలువురు న్యాయవాదులను నియమించి వారి పక్షాన తీర్పు వచ్చేలా కృషి చేశారు. దీంతో దళితుల మనసుల్లో బీజేపీ ఇప్పుడిప్పుడే అంకురించే దిశగా ముందుకు వెళ్లినట్లయ్యింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలు స్వాగతించినా, అధికారికంగా కాంగ్రెస్​ రాహుల్​ బాబాలు మాత్రం ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఈ విధంగా నాలుగోసారి చతికిలపడ్డ వారిగా బాబా నిలిచారు. 
 
ఒక అత్యంత ప్రముఖమైన రాహుల్​ బాబా చేస్తున్న ఐదో తప్పు కులగణన. పదేపదే కులగణన గురించి దేశ, విదేశాల్లో ప్రముఖ వేదికలపై మాట్లాడుతూ.. అన్యాయం, అక్రమం అంటూ ఊదరగొట్టారు. వాస్తవాలు గమనిస్తే కులగణన ద్వారా పలు వర్గాలు, కులాలకు న్యాయం చేకూరినా అంతిమంగా అది మరోవైపు దారి తీసి దేశ ఐక్యతను దెబ్బతీసే దిశగా వెళ్లే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీతో నడుస్తున్న వారి ఆకాంక్షలను కూడా పక్కన పెట్టి ఆయనకు ఏది వస్తే అది పలు వేదికలపై మాట్లాడి ఉన్న పరువు కాస్త పోగొట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్​ పార్టీ గెలిచిన ప్రాంతాల్లో కులగణన ప్రస్తావనే ఎత్తకపోవడం గమనార్హం. కర్ణాటకలో కులగణన జరిగినా దాన్ని బహిర్గతం చేసేందుకు భయపడి చస్తున్నారు. ఈ నివేదికను కూడా బయటికి వెళ్లడించలేకపోవడం రాహుల్​ బాబాకు కాంగ్రెస్​ పార్టీలో ఉన్న స్థానాన్ని సూచిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఏది ఏమైనా రాహుల్​ గాంధీ అపరిపక్వ రాజకీయ నాయకుడే తప్ప, ప్రజాశ్రేయస్సు కోరే నాయకుడు ఎన్నటికీ కాలేడని ఆయా నిర్ణయాలతో ఇట్టే తెలిసిపోతుంది.