అంబరాన్నంటిన విజయదశమి వేడుకలు

ప్రముఖ గాయకులతో సంగీత విభావరి  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ 

Oct 13, 2024 - 19:32
 0
అంబరాన్నంటిన విజయదశమి వేడుకలు

నా తెలంగాణ, సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. సంగారెడ్డి పట్టణంలోని రామమందిరంలో శ్రీ రామచంద్రముర్తీకి జగ్గారెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించి  తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
 
అనంతరం భజన మండలితో కలిసి రామ మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా అంబేద్కర్ స్టేడియానికి బయలుదేరి, భజన పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. అంబేద్కర్ స్టేడియంలో భక్తి భావంతో వేడుకలు నిర్వహించారు. దుర్గ భవాని మాతను పూజించి శమి పూజ నిర్వహించి, జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, కృష్ణ చైతన్య, సునీత ఆధ్వర్యంలో పాటలు పాడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేశారు. రామాయణంలోని ఘట్టాలను ఆధారంగా చేసుకుని కళాకారులు నాట్య ప్రదర్శనలు నిర్వహించి, ప్రజలలో ఉత్సాహం నింపారు.
 
గాయకుడిగా మారిన జగ్గారెడ్డి ..
తన గాత్రంతో భక్తి గీతాలు, భజన గీతాలు ఆలపించి అందరిని ఆశ్చర్యపరిచారు. జిల్లా ఎస్పీ చెన్నూరి  రూపేష్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టపాసులతో రావణ దహనం చేసి విజయదశమి వేడుకలను విజయవంతంగా ముగించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జయారెడ్డిలు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాటు అనంత కిషన్, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు బుచ్చి రాములు, కాంగ్రెస్ నాయకులు, భజన మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.