దళారుల జేబులోకి ఒప్పంద కార్మికుల బోనస్

Bonus of contract laborers pocketed by brokers

Oct 13, 2024 - 19:21
 0
దళారుల జేబులోకి ఒప్పంద కార్మికుల బోనస్
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థలో పని చేస్తునటువంటి 25 వేల మంది అవుట్సోర్సింగ్, ఒప్పంద డ్రైవర్, కార్మికులకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బోనస్ గా రూ.5000 ఇవ్వడం పట్ల ఒప్పంద కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ ఒప్పంద కార్మికుని మాస్టర్లు, బ్యాంకు డీటెయిల్స్, ఆధార్ కార్డులను సేకరించిన యాజమాన్యం చివరికి కార్మికుల ఖాతాల్లో కాకుండా కాంట్రాక్టర్ల ఖాతాలో బోనస్ డబ్బులను జమచేసి కాంట్రాక్టర్లకే పట్టం కట్టింది. 
 
దీంతో బోనస్​ డబ్బులు కాస్త కాంట్రాక్టర్ల చేతి నుంచి దళారుల జేబులోకి వెళ్లడం గమనార్హం. మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్ లో పనిచేస్తున్న అవుట్​ సోర్సింగ్​, ఒప్పం ద కార్మికులకు, డ్రైవర్లకు అసలు కష్టాలు ఇక్కడే మొదలయ్యాయి. మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్ లో అద్దె వాహనాలపై అజమాయిషీ చేస్తున్న దళారులు వారికి దగ్గర ఉండే కొందరు డ్రైవర్లకు బోనస్ డబ్బులను మొత్తాన్ని చెల్లించడం మిగిలిన డ్రైవర్లకు సగం మీకు మిగిలిన సగం నాకంటూ తిరఖాసు పెడుతున్నారు. ఒప్పంద డ్రైవర్లు పేరుతో జమైన మీకెందు సగం ఇవ్వాలని ప్రశ్నించిన వారిని డ్యూటీ నుంచి తొలగిస్తామని దళారులు అనడంతో కార్మికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 
 
2023–24 సంవత్సరం మార్చి వరకు విధులు నిర్వహించి తొలగిపోయిన పలువురు కార్మికుల మాస్టర్లు, బ్యాంకు డీటెయిల్స్, ఆధార్ కార్డులను సేకరించి వారి బోనస్ వస్తాయని డ్రైవర్ల పేర్లతో దళారులు బోనస్ డబ్బులకు అప్లై చేసి వచ్చిన డబ్బును కాస్త మింగేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఆర్థికంగా వెనుకబడిన అవుట్ సోర్సింగ్, ఒప్పంద డ్రైవర్, కార్మికుల కుటుంబాలను ఆర్థిక భరోసా అందిస్తుంటే దళారులు మాత్రం వాటిని దండుకుంటూ అక్రమ ధనాన్ని అర్జిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం,  సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.