సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ కలెక్టర్ వల్లూరు క్రాంతి 

Sep 30, 2024 - 20:17
 0
సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
 నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్:  ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం  నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో 60 దరఖాస్తులు అందాయి. 
 
ప్రజావాణి అనంతరం..
వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వేగంగా  పరిష్కారం చూపి, ఆన్ లైన్​ లో నమోదు చేయాలని అన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు ప్రతి నెలా సమర్పించే ముందస్తు టూర్ డైరీలను సకాలంలో సమర్పించాలని సూచించారు. ఈ టూర్ డైరీ ప్రకారం ప్రతిరోజు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 
గ్రామాల్లో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీరాజ్ శాఖ ఏఈలు, జిపి సెక్రెటరీలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యం గా కె జిబివి పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల మెనూ ప్రకారం భోజన వసతి కల్పించాలని, త్రాగునీటి సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాల్లో త్రాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  అధికారులను ఆదేశించారు.
 
ప్రజావాణి దరఖాస్తుల విషయానికి వస్తే, రెవెన్యూ శాఖ 30, దరఖాస్తులు, సర్వే ల్యాండ్ రికార్డు 5, పౌరసరఫరాల శాఖ 2, పంచాయతీరాజ్ అండ్​ పిటి విభాగం 7, పురపాలక శాఖ 5, జిల్లా సంక్షేమ శాఖ  4, విద్యాశాఖ 1, వ్యవసాయ శాఖ నుంచి 3, వైద్య ఆరోగ్య శాఖ 1, ఎక్సైజ్ శాఖ  2, దరఖాస్తులు అందాయని తెలిపారు. అన్ని దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
 
ఈ కార్యక్రమం లో అదనపు  కలెక్టర్ లు చంద్రశేఖర్​,  మాధురి, పద్మజ రాణి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.