మోదీ చేతుల్లోనే సురక్షితంగా భారత్: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy said that India will be safe in the hands of Modi
- దేశ ప్రజలంతా మోదీ వైపు ఉన్నారు
- మోదీ పాలనలో అవినీతి, ఉగ్రవాదం పోయాయి
- ప్రపంచంలో భారత దేశ గౌరవం పెరిగింది
- విప్లవాత్మక సంస్కరణలకు మోదీ శ్రీకారం చుట్టారు
- అందుకే ప్రజలు మళ్లీ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
- బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్
నా తెలంగాణ, హైదరాబాద్: మోదీ చేతుల్లోనే భారతదేశం సురక్షితంగా ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి అన్నారు. గత పదేండ్ల పాలనలో అవినీతిపై, ఉగ్రవాదంపై మోదీ ఉక్కు పాదం మోపారని, ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టను పెంచారని గుర్తు చేశారు. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మోదీ వైపే దేశ ప్రజలు నిలుస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని తార్నాక డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఓటింగ్ శాతం పెరగాలి
తెలంగాణలో నాలుగో విడతలో మే13న ఎన్నికలు ఉంటాయని, జూన్ 4న ఫలితాల రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బీజేపీ అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి ఎంపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఐదు సభల్లో పాల్గొన్నారు. అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ 40 శాతానికి మించి ఓటింగ్ శాతం ఉండదు. దానిపై మనం దృష్టి సారించాలి. ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. వ్యక్తిగతంగా సంఘంగా ఏర్పడి ఓటు వేసే ఉద్యమాన్ని నడపాలి. అందరూ పోలింగ్ లో పాల్గొనాలి. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. 2014కు ముందు 50 సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. మోదీకి ముందు మోదీ తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మీరే స్వయంగా ఆలోచించండి. అవినీతి రహిత పరిపాలన అందించిన మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది, శాంతిభద్రతలు దేశ భద్రతను దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. ఉగ్రవాదాన్ని పెకిలించి బాంబు పేలుళ్లకు అడ్డుకట్ట వేసింది బీజేపీ ప్రభు. మహిళల 33 శాతం రిజర్వేషన్, ట్రిపుల్ తలాఖ్ రద్దు లాంటి సంస్కరణలు తెచ్చారు. కరోనాను కట్టడి చేసి వ్యాక్సిన్ అందించారు”అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అవినీతి..
50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత10 ఏండ్లలో రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిందని కాగ్ బయటపెట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ సంస్థలు, ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ నగరంలో ఎలా బలపడ్డాయో, వేళ్లూనుకపోయాయో.. గూగుల్ చాట్, లుంబినీ పార్క్ లాంటి ప్రదేశాల్లో మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. జీతాలివ్వలేని పరిస్థితి నుంచి భారత్ ను ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా మోదీ తీర్చిదిద్దారు. ఈ దేశంలో నిరక్ష్యరాస్యత ఉందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కానీ ఈ రోజు ప్రతీ చిన్న దుకాణంలో సాంకేతిక లావాదేవీలు పెరిగాయి. పాక్ నకిలీ నోట్లు ప్రింట్ ఆగిపోయింది. ఉగ్ర కార్యకలాపాలు ఆగిపోయాయి. పాక్ ను మోదీ అంతర్జాతీయంగా ఏకాకిగా నిలబెట్టారు. చైనా నుంచి వచ్చే అనేక ఉత్పత్తుల కొనుగోలు తగ్గించేయడంతో చైనాకు రుచించడం లేదు. అందుకే చైనా పాక్ తో దోస్తీ చేస్తూ ఉగ్రవాద ఊబిలో ఇరుక్కుపోతోంది”అని తెలిపారు.
మోదీ విప్లవాత్మక నిర్ణయాలు
రామజన్మభూమి, ఆర్టికల్ 370, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇలాంటి అనేక సమస్యలను మోదీ పరిష్కరించారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘ ఆర్మీలో మహిళలకు అవకాశం కల్పించారు. ఇటీవల 26 జనవరి రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో 90 శాతం మహిళా దళాలే పాల్గొన్నాయి. నిస్వార్థంగా సమాజం, దేశం కోసం సేవ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఆశీర్వదించాలి. 2014లో 270, 2019లో 303 స్థానాలకు బీజేపీ పెరిగింది. 2024లో 370, ఎన్డీయే భాగస్వామ్యంతో 400 పై చిలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రపంచదేశాల్లో భారతదేశ కీర్తి, గౌరవాలు ఎలా పెరిగాయో చూస్తున్నారు. గతంలో భారత ప్రధాని ఎక్కడో లాస్ట్ లో కనిపించేవారు. కానీ ప్రస్తుతం ఫ్రంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని 48 గంటలపాటు ఆపించి మనదేశ విద్యార్థులను 25 వేల మందిని వెనక్కి తీసుకురావడం మోదీ ఒక్కడి వల్లే సాధ్యమైంది”అని కిషన్ రెడ్డి తెలిపారు.