మంగళసూత్రం అనుమతించరా..?

కల్వకుంట్ల కవిత తీహార్​ జైలు అధికారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత పిటిషన్ పై శనివారం విచారణ జరుపనున్న రౌస్ అవెన్యూ కోర్టు

Mar 28, 2024 - 21:15
 0
మంగళసూత్రం అనుమతించరా..?

నా తెలంగాణ, న్యూఢిల్లీ​: తీహార్ జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, పెన్నులు, బెడ్‌షీట్స్, పేపర్లు తెప్పించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పించగా.. జైలు అధికారులు మాత్రం అనుమతించడం లేదని కోర్టు మెట్లెక్కారు. వెంటనే ఇంటి భోజనం సహా మిగతా వెసులుబాట్లు కల్పించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 9 వరకు ఆమె రిమాండ్ కొనసాగనుంది. హైబీపీ కారణంగా జైలులో కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు కోర్టు అంగీకరించిది. ఇంటి భోజనంతో పాటు.. మెడిసిన్స్, పెన్నులు, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. మంగళసూత్రం, కల్లజోడు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తాజాగా.. ఈ సౌకర్యాలు జైలు అధికారులు తనకు కల్పించడం లేదని మరోసారి కవిత కోర్టును ఆశ్రయించింది. కవిత పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఎల్లుండి విచారిస్తామని పేర్కొంది. టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయని జైలు అధికారి ఒకరు తెలిపారు. కవిత ప్రత్యేకంగా నిర్దుష్ట వసతులు ఏమీ డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు. అయితే, కోర్టు ఆదేశాల ప్రకారం.. కవితకు ఇంటి భోజనం, బెడ్, పరుపులు, చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని జైలు అధికారి వివరించారు. అంతేగాక, దుస్తులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, నగలు, మందులు, మంగళసూత్రం ధరించేందుకు కూడా కోర్టు అనుమతి ఉంది. ఆమెకు తీహార్ జైలు గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని సదరు జైలు అధికారి వెల్లడించారు.