చేతులెత్తేసిన ఉక్రెయిన్ అమెరికా ట్రుపుల్ గేమ్
Ukraina America trouple game
నాటోదేశాలకు దడ మొదలు
ఆయుధాల అమ్మకం, చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం, ఆర్థికంగా ఎదగడం
ట్రంప్–పుతిన్ చర్చల సారాంశమిదే?!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తామనడం వెనుక ట్రంప్ హస్తం ఉందా? అంటే అవుననే చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం తరువాత ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీకి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇంతకాలం బైడెన్ ఉక్రెయిన్ కు ఆపన్నహస్తం అందిస్తుండడంతో భారీగా ఆ దేశానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించింది. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నారు. దీంతో ఒకప్పటి ప్రపంచ పెద్దన్న దేశంగా ఉన్న రష్యాతో ఉక్రెయిన్ లాంటి దేశం యుద్ధం చేయలేదన్నది జగమెరిగిన సత్యం. ఇంతకాలం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో దేశాలు (యూరోపియన్) సహకారంతో భారీగా ఆయుధాలు అందజేస్తూ యుద్ధాన్ని కొనసాగించేలా ప్రోత్సహించారు. ఇందువల్లే యుద్ధం చాలాకాలం కొనసాగింది. అదే సమయంలో రష్యాకు కూడా నష్టం జరుగుతుందనుకున్నా రష్యా ఆర్థిక వ్యవస్థలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గతంలో భారత్ కు 1 శాతం చమురును సరఫరా చేసిన రష్యా, ప్రస్తుతం 40 శాతం చమురును సరఫరా చేస్తూ ఆర్థిక ఒడిదుడుకులను పూడ్చుకుంటోంది. భారత్ తిరిగి ఇదే చమురును యూరోపియన్ దేశాలకు అందజేసింది.
యూరోపియన్ దేశాలు రష్యాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఫ్రాన్స్, నార్వే, యూకె, స్విట్జర్లాండ్, ఫిన్ లాండ్ లాంటి దేశాలు ఉక్రెయిన్ కు భారీ సహాయం చేయడంలో ముందువరుసలో ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం ముగిసే దశలో ఉండడంతో ఈ దేశాలపై రష్యా ఆధిపత్యం కొనసాగినట్లయ్యింది. మరోవైపు రష్యాతో పెట్టుకుంటే ఈ దేశాలు మనగగలిగే స్థితిలో లేవు. ఇది అమెరికాకు కూడా లాభదాయకమే. అమెరికా ఆయుధాలను భారీగా ఈ దేశాలకు అమ్ముకునే యోచనలో ఉంది. ఇది కూడా యుద్ధం ముగిసేందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అదే సమయంలో చైనాతో బయోవార్ ముప్పు పొంచి ఉండడాన్ని కరోనా సమయంలో అమెరికా ఇంటలిజెన్స్ గుర్తించింది. అప్పటి నుంచి చైనాకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రపంచదేశాలకు ప్రత్యామ్నాయ దేశాన్ని వెతికింది. భారత్ చైనాకు ఏ మాత్రం తీసిపోదని గుర్తించి మోదీ సంస్కరణలు, విధానాలు, నమ్మకం, విశ్వసనీయతతో దోస్తీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఉండడంతో భారత్ కూడా ప్రపంచదేశాలన్నింటికి ఆపన్నహస్తం అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతుంది. భవిష్యత్ లో చైనా లాంటి దేశం బయోవార్ కు పాల్పడితే ప్రపంచదేశాల్లో పెనుముప్పు తప్పదని అమెరికా భావిస్తుంది. అందుకే చైనాతో రష్యా దోస్తీని తగ్గించాలని కోరుకుంటుంది. ట్రంప్–పుతిన్ ల మధ్య ఒకవేళ చర్చలు జరిగితే ఇదే దిశగా సారాంశం ఉండనుందనేది విశ్లేషకుల భావన.
ఏది ఏమైనా అమెరికాను పెదన్న దేశంగా ఉరికే పిలవరన్నది దీంతో స్పష్టం అవుతుంది. ఒకే దెబ్బతో మూడు పిట్టలను కొట్టినట్లయ్యింది. ఒకటి తమ ఆయుధాలను నాటోదేశాలకు అమ్ముకోవడం, రెండోది చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం, మూడోది తమ దేశం ఆర్థిక పటుత్వాన్ని సాధించడం లాంటి విషయాలు వీటి వెనుక దాగి ఉన్నాయి.