తెలంగాణపై మోదీ ప్రత్యేక దృష్టి

తెలంగాణలో పలు ప్రాజెక్టుల ప్రారంభం నేడు ప్రధాని పర్యటన

Mar 3, 2024 - 16:48
 0
తెలంగాణపై మోదీ ప్రత్యేక దృష్టి

నా తెలంగాణ, హైదరాబాద్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 న తెలంగాణలో పర్యటించనున్నారు. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో జరిగే బహిరంగసభల్లో మోదీ పాల్గొంటారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభాలు ప్రధాని చేతుల మీదుగా జరుగనున్నాయి. 

రూ. 56 వేల కోట్లతో బహుళ ప్రాజెక్టులు..

ఆదిలాబాద్ ​లో రూ. 56వేల కోట్లతో విద్యుత్, రైలు, రోడ్లకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల రెండో యూనిట్​ తెలంగాణ సూపర్​ థర్మల్​ పవర్​ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్​ కేంద్రాన్ని అల్ట్రా-సూపర్‌ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ లో తెలంగాణకు 85 శాతం సరఫరా చేయనున్నారు. కొత్తగా విద్యుదీకరించిన అంబారీ– ఆదిలాబాద్​–పింపాల్​ కు రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఎన్​ హెచ్​353–బి, ఎన్ ​హెచ్​163 తెలంగాణ నుంచి మహారాష్ర్ట, తెలంగాణను ఛత్తీస్ ​గఢ్ ​తో కలిపే రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 

సీఏఆర్​వో..(కారో) తో గగనతల సవాళ్ల పరిష్కారం..

హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఏఆర్​వో) కేంద్రాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. పౌర విమానయాన రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్​అండ్​ డీ) కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో సీఏఆర్​వోను ఏర్పాటు చేసింది. గగనతలంలో విమానాలకు ఎదురయ్యే పలు సవాళ్లను పరిష్కరించడం ప్రధాన విమానాశ్రయాల్లో ఎదురయ్యే జఠిల సమస్యలను పరిష్కరించడం కోసం పూర్తి స్వదేశీయంగా అంతర్గత పరిశోధనల ద్వారానే మార్గం సుగమం చేసుకోవాలనే ఉద్దేశంతో సీఏఆర్​వోను రూ.350 కోట్లతో స్థాపించారు. ఇందులో అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఇందులో కల్పించారు. 

రూ. 6800 కోట్లతో సంగారెడ్డిలో..

రూ. 6800 కోట్లతో సంగారెడ్డిలో రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. 40 కి.మీ. పొడవున కంది నుంచి రాంసాని​ పల్లె వరకు ఎన్ ​హెచ్​–161 వరకు నాలుగు లైన్లతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇండోర్​– హైదరాబాద్​ ఎకనామిక్​ కారిడార్, తెలంగాణ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ ల మధ్య రవాణా సౌకర్యం సులభతరం కానుంది. హైదరాబాద్​– నాందేడ్​ మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభంతో మూడు గంటల రవాణా సమయాన్ని తగ్గిస్తుంది. మరో ప్రాజెక్టు 47 కిలోమీటర్ల పొడవున్న మిర్యాలగూడ నుంచి ఎన్ ​హెచ్​​–167 లోని కోదాడ సెక్షన్​ నుంచి రెండు లేన్​లుగా తీర్చిదిద్దారు. దీంతో మెరుగైన కనెక్టివిటీతో పాటు ఈ ప్రాంతంలో పర్యటకం, ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయమైన పెరుగుదల, పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. 

పూణే–హైదరాబాద్ ​రహదారికి మహార్దశ..

ఎన్ ​హెచ్​​–65పైన 29 కి.మీ. పొడవైన పూణే – హైదరాబాద్​ ఆరులైన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. పటాన్​ చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం లాంటి ఇతర ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు దీని ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. 


రైల్వేల అభివృద్ధితో ప్రయాణాలు మరింత సులభతరం..

సనత్ ​నగర్​– మౌలాలీ రైలు మార్గాన్ని ఆరు కొత్త స్టేషన్​ భవనాలు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 22 కిలోమీటర్ల మేర రైల్వే సిగ్నలింగ్​ ను ఆధునీకరించనున్నారు. ఎంఎంటీఎస్​ ఫేజ్​–2 ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యింది. దీని ద్వారా ఫిరోజ్ ​గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరేడ్​మెట్, మౌలాలీ హౌసింగ్​ బోర్డ్​ స్టేషన్​లలో ఆరు కొత్త భవనాలను నిర్మించారు. దీంతో ఈ స్టేషన్ల ద్వారా ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలను మరింత పెంచనున్నారు. ఘట్‌కేసర్–- లింగంపల్లి నుంచి మౌలాలీ–సనత్‌నగర్ మీదుగా ఎంఎంటీఎస్​ రైలు సర్వీసును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. దీని ద్వారా చెర్లపల్లి, మౌలాలీ వంటి కొత్త ప్రాంతాలను జంట నగరాలతో కలిపే రవాణా సౌకర్యంలో మరింత వేగం పుంజుకోనుంది. ఇండియన్ ఆయిల్ పారాదీప్- హైదరాబాద్ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 4.5 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో తెలంగాణలో 160 కి.మీ. పైప్ ​లైన్​ ఏర్పాటు చేయనున్నారు.