యమునా కాలుష్యానికి యూపీ, హరియాణా కారణం
ఢిల్లీ సీఎం అతిశీ ఆరోపణ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ యమునా, ఆనంద విహార్ కాలుష్యానికి ఉత్తరప్రదేశ్, హరియాణాలే కారణమని సీఎం అతిశీ ఆరోపించారు. ఈ ఆదివారం పెరుగుతున్న కాలుష్యంపై మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ర్టాలు శుద్ధి చేయకుండా నీటిని వదులుతుండడంతో యమునా నదిలో కాలుష్య కారకాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఆదివారం నుంచి యమునా నీటిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ జల్ బోర్డు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని తెలిపారు. యమునాలో వచ్చే నురగను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 445కు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. ఈ అంశంపై యూపీ, హరియాణా ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు. ఢిల్లీ అంతటా 99 బృందాలను ఏర్పాటు చేసి ధూళి నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 325 స్మోక్ గన్ లతో కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు.